ప్రపంచ రికార్డును బ్రేక్ చేయనున్న కాళేశ్వరం ప్రాజెక్ట్

kaaleshwaram project is going to break the world record

తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది. కనివినీ ఎరుగని ఈ ఇంజినీరింగ్ అద్భుతం చాలా తక్కువ సమయంలోనే సిద్ధం కావడం ఒక రికార్డు కాగా.. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌(LIS)గా సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకోడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ‘గూగుల్’ సెర్చ్‌లో అతి పెద్ద LISగా టాప్‌ స్థానంలో నిలిచింది.  ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ ఇరిగేషన్) అంటే సాధారణ డ్యామ్‌లు నిర్మించినంత ఈజీ కాదు. దీని నిర్మాణం ఎంతో క్లిష్టంగా ఉంటుంది. కొన్ని వందల గ్యాలాన్ల నీటిని నది నుంచి తోడి ఎగువ ప్రాంతానికి పంపాలంటే భారీ మోటార్లు, పైపులు అవసరం అవుతాయి. పైగా ఎత్తుపల్లాలు అధికంగా ఉండే భూముల్లో ఈ పనులు చేపట్టడం మరింత కష్టం. అయితే, ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా కాళేశ్వరాన్ని విజయవంతంగా పూర్తిచేయడం గమనార్హం. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రీడిజైన్ చేయించారు. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్‌రావు పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో స్వల్ప కాలంలోనే భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు గూగుల్‌లో World’s biggest Lift Irrigation Scheme అని సెర్చ్ చేస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరే వస్తోంది. ఇప్పటి వరకు అమెరికాలోని కొలరాడో, ఈజిప్టులోని గ్రేట్ మ్యాన్ మేడ్ నదిలో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు మాత్రమే ప్రపంచంలో అతి పెద్దవిగా రికార్డు ఉంది. అయితే, కాళేశ్వరమే అతి పెద్ద LIS అనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.