Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పటినుంచి విశ్వనటుడు కమల్ హాసన్ బీజేపీని లక్ష్యంగా చేసుకుని అనేక విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై తరచూ తన వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని గతంలో సమర్థించినందుకు దేశప్రజలు తనను క్షమించాలని కోరిన కమల్… బీజేపీ కీలక నిర్ణయాలకు తాను వ్యతిరేకమని తేల్చిచెప్పారు. మెర్సెల్ సినిమాలోని వివాదాస్పద జీఎస్ టీ డైలాగ్ పైనా… కమల్ ఇలాగే స్పందించారు. ఆ డైలాగ్ ను తీసేయాలని బీజేపీ పట్టుబట్టడాన్ని కమల్ తప్పుబట్టారు. విమర్శలను ఆపేందుకు ప్రయత్నించకూడదని, వాటికి సమాధానం చెప్పాలని సూచించారు.
తాజాగా జనగణమన వివాదంపైనా కమల్ కేంద్రప్రభుత్వ తీరును ఆక్షేపించారు. ప్రజలు తమ దేశభక్తి నిరూపించుకోడానికి సినిమాహాళ్లలో జాతీయ గీతం ప్రసారమయినప్పుడు లేచినిల్చోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడిన నేపథ్యలో కమల్ స్పందించారు. సుప్రీంకోర్టు అభిప్రాయానికి కమల్ మద్దతు పలికారు. భారత్ ను సింగపూర్ తో పోలుస్తూ వ్యాఖ్యానాలు చేశారు. రోజూ అర్ధరాత్రి సింగపూర్ తమ జాతీయ గీతాన్ని ప్రసారం చేస్తుందని, కావాలంటే కేంద్రప్రభుత్వం కూడా అలా దూరదర్శన్ లోజనగణమనను ప్రసారం చేయాలని, అంతేకానీ… ఎక్కడపడితే అక్కడ దేశభక్తిని రుజువుచేసుకోవాలని బలవంత పెట్టకండి అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఇలాంటి వివాదాస్పద విషయంలో సింగపూర్ ను ప్రస్తావించడానికి గల కారణాన్ని కూడా ఆయన వివరించారు.
సింగపూర్ నియంతృత్వ దేశమని కొందరు విమర్శకులు వాదిస్తుంటారని, అది మనకు కూడా కావాలా…? వద్దు ప్లీజ్ అని ట్వీట్ చేశారు కమల్. అటు జనగణమనను సినిమా హాళ్లలో తప్పనిసరి చేయడంపై… ప్రముఖ నటుడు అరవింద్ స్వామి కూడా అభ్యంతరం వ్యక్తంచేశారు. జాతీయగీతం వినిపించినప్పుడు తాను లేచి నిలబడడంతో పాటు, తోటివారితో కలిసి ఆలపిస్తానని, అయితే అది సినిమా హాళ్లలోనే ఎందుకు తప్పనిసరి చేశారో అర్ధం కావడం లేదని అరవింద్ స్వామి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రోజూ జాతీయ గీతం ఎందుకు పాడడం లేదని ప్రశ్నించారు.