Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు అనగానే ఈ తరం వాళ్లకు గుర్తొచ్చేది ఇద్దరే. ఒకరు కరుణానిధి, మరొకరు జయలలిత. తమిళ రాజకీయం మొత్తం వాళ్లిద్దరి చుట్టూనే తిరుగుతుండేది. ఇద్దరు హేమా హేమీల ఎత్తులు, పై ఎత్తులు, కక్షలు, కార్పణ్యాలు, పగ తీర్చుకోవడాలతో ఒకటి కాదు రెండు కాదు… 25 ఏళ్లపాటు తమిళ రాజకీయాలు నడిచాయి. రాష్ట్రానికి చెందిన ప్రతి అంశాన్ని వారిద్దరే శాసించారు. తమిళనాడును దేశంలో విలక్షణ రాష్ట్రంగా నిలబెట్టారు. ఢిల్లీలో ఏకపార్టీ పాలనకు కాలం చెల్లిపోయి భాగస్వామ్య పక్షాలతో ఏర్పడే కూటముల్లో తమ పార్టీలకు, తద్వారా రాష్ట్రానికి ప్రముఖ స్థానం దక్కేలా చేశారు. ఇది 2016కు ముందు పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ స్థితి తలకిందులయింది. ఆ దిగ్గజాల్లో ఒకరు కురువృద్ధుడై రాజకీయ యవనిక నుంచి తప్పుకుంటే… మరొకరు శాశ్వతంగా ఈ లోకానికి దూరమయ్యారు. ద్రవిడ రాజకీయాన్ని శూన్యంగా మార్చివేశారు. అనిశ్చితికి మారుపేరుగా మారి, అత్యంత బలహీనంగా తమిళనాడు కనిపించడానికి గల ఏకైక కారణం ఇదే.
2016 ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత హఠాత్తుగా అనారోగ్యానికి గురై అమ్మ జయలలిత చనిపోవడం, వృద్ధాప్యం కారణంగా కరుణానిధి యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొనలేకపోవడం తమిళనాడుకు శాపంగా మారింది. ముఖ్యంగా వరుసగా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన జయలలిత ఏడాదైనా పాలించకముందే కన్నుమూయడం, ఆ తదనంతర పరిణామాలు తమిళనాడును ఆందోళనక పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి. ఏ రాష్ట్రానికైనా… ఆ రాష్ట్రం పేరు చెప్పగానే ఓ బలమైన నాయకుడు లేదా నాయకురాలి పేరు స్ఫుర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు, తెలంగాణకు కేసీఆర్, బీహార్ కు నితీశ్ కుమార్, లాలూ, మధ్యప్రదేశ్ కు శివరాజ్ సింగ్ చౌహాన్, ఒకప్పుడు గుజరాత్ కు మోడీ ఇలా… ఆయా నేతలు… రాష్ట్రంలో కేవలం ఐదారేళ్లు ముఖ్యమంత్రులుగా పనిచేసి దిగిపోయే నేతలు కాదు… తమకు, తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టే నేతలు. ఇప్పుడలాంటి నేతలే తమిళనాడుకు కరువయ్యారు.
జయలలిత మరణించి ఇవాళ్టికి సరిగ్గా ఏడాది. ఈ ఏడాది కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్నన్ని రాజకీయ పరిణామాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ జరగలేదు. అమ్మ మరణిస్తూనే… ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టారు. ఇది అలాగే కొన్నాళ్లు కొనసాగితే… అమ్మ లేని లోటు ప్రజలకు పెద్దగా తెలిసేది కాదు. ప్రశాంతంగా పాలన సాగిపోయేది. కానీ శశికళ అత్యాశ… అన్నాడీఎంకెను, తద్వారా తమిళనాడును గందరగోళ స్థితిలోకి నెట్టేసింది. రిసార్టు రాజకీయాలు, పదవుల పంపకాలు, చీలికలు, బేరసారాలుతో రాష్ట్రం అమ్మ లేని అనాథ పిల్లల పరిస్థితిని తలపించింది. అసెంబ్లీ ఎన్నికలు మళ్లీ జరిగేది 2021లో.
కానీ అప్పటిదాకా… ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల స్నేహం నిలిచి ఉంటుందన్న నమ్మకం ఎవరికీ లేదు. ఐదేళ్లు అన్నాడీఎంకె ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్న భరోసా ఆ పార్టీ కార్యకర్తల్లో లేశమాత్రమైనా కనిపించడం లేదు. ఐటీ దాడులు, కేంద్ర ప్రభుత్వ జోక్యం, బలహీన ప్రతిపక్షం, సయోధ్య లేని అధికార పార్టీ నేతల తీరుతో… తమిళనాడులో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఇదే అదనుగా… కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్, అజిత్, విశాల్ వంటి సినీ నటులు రాజకీయాల వైపు వడివడిగా అడుగులేస్తున్నారు. మరి వాళ్లల్లో ఏ ఒక్కరైనారాజకీయ స్థిరత్వం తీసుకొచ్చి తమిళనాడుకు పునర్ వైభవం సాధిస్తారా లేక విజయ్ కాంత్ బాటలో నామమాత్రంగా మిగిలిపోతారా అన్నది కాలమే తేల్చాలి.