Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కాబోతుంది. గత కొన్ని వారాలుగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఇప్పటికే చిరంజీవి లుక్ ఫైనల్ అయ్యింది. చిరంజీవి లుక్ వల్ల కొద్ది రోజులు ఆలస్యం అవ్వగా, ఆ తర్వాత సినిమాటోగ్రఫర్ అర్థాంతరంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వల్ల కూడా సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. కొత్త సినిమాటోగ్రఫర్ రత్నవేల్‌ను ఎంపిక చేయడంతో పాటు, లొకేషన్స్ అన్ని ఫైనల్ అవ్వడంతో సినిమాను రేపటి నుండి సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తుండగా, ముఖ్య పాత్రల్లో జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్, అమితాబచ్చన్‌లు నటించబోతున్నారు. వీరు మాత్రమే కాకుండా సినిమాలో ఇంకా పలువురు స్టార్స్ మెరవనున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి ‘సైరా’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
సినిమా వాయిదాలు పడుతూ ఉండటంతో ప్రేక్షకులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేసినా కూడా మొత్తానికి సినిమా ప్రారంభం అయిన తర్వాత సినిమా కోసం ప్రేక్షకులు మరియు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం ఖాయం. వచ్చే సంవత్సరం డిసెంబర్‌లో సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం 2019 సంక్రాంతికి సినిమా విడుదల అవ్వనుందని అంటున్నారు. ఎప్పుడు విడుదల అయినా కూడా చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ గా సంచలనాలు నమోదు చేయడం గ్యారెంటీ.