సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకంపైనా…రచయిత కంచె ఐలయ్య పైనా..ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ లోనే కాదు..ఆంధ్రప్రదేశ్ లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. పుస్తకాన్ని నిషేధించాలని వైశ్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్యులు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇలాంటి పుస్తకాలు రాయడం మంచిది కాదని, ఇది సరైనది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎవరూ ఇలాంటివి ప్రోత్సహించకూడదని, ఒక కులాన్ని కించపర్చే విధంగా పుస్తకాలు రాయడం, వ్యాఖ్యలు చేయడం సమాజంలో విద్వేషాలు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
అందరూ సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి కోరారు. కులాలను, వ్యక్తులను కించపరిచేలా ఉన్న పుస్తకాలు పబ్లిష్ కాకుండా…ఒకవేళ పబ్లిష్ అయినా..మార్కెట్ లోకి వెళ్లకుండా కట్టడి చేయాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కంచె ఐలయ్య పుస్తకంపై రాష్ట్రప్రభుత్వం చర్చిస్తోందని బాబు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కంచె ఐలయ్యపై ఆగ్రహంతో ఉంది. ఐలయ్య పుస్తకాన్నీ సామాన్యులే కాదని..ఏ మేధావీ కూడా సమర్థించడని తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.