Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అధ్యక్ష బాధ్యతలు చేపడుతూనే అధిష్టానం అప్పజెప్పిన పని ప్రారంభించారు ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ. బీజేపీ-టీడీపీ వైరం నేపథ్యంలో… కొత్త శత్రువును దీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేతగా భావించడంతో పాటు కుల సమీకరణాల లెక్కల్లో పార్టీ అసలు సూత్రాలకు విరుద్ధంగా కన్నాకు ఏపీ బాధ్యతలు కట్టబెట్టారు మోడీ-షాలు… తొలి నుంచీ టీడీపీతో రాజకీయ వైరం ఉన్న కన్నా అయితే చంద్రబాబును దీటుగా ఎదుర్కోగలరన్నది అధిష్టానం వ్యూహం. అధ్యక్షహోదాలో ఢిల్లీ వెళ్లిన కన్నా… అక్కడే… తనకప్పగించిన పని ప్రారంభించారు. హస్తిన వేదికగా చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు మొదలుపెట్టారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కన్నా ఏపీ విషయంలో కేంద్రం తీరును సమర్థిస్తూ, చంద్రబాబును దుయ్యబట్టారు.
ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇచ్చినా చంద్రబాబు సాధించుకోలేకపోయారని విమర్శించారు. మోడీపై ఏపీలో దుష్ప్రచారం జరుగుతోందని, నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని కన్నా స్పష్టంచేశారు. 2019 ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందడానికే బీజేపీపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నూటికి నూరుశాతం నెరవేరుస్తుందన్నారు. పొత్తులో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయింది తప్ప కేంద్రప్రభుత్వం ఏనాడూ రాష్ట్రప్రభుత్వం అడిగినవి కాదనలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడకపోతే భయపడడం ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ, జనసేన పార్టీలతో బీజేపీ కలిసి పోటీచేస్తుందన్న వార్తలను కన్నా కొట్టిపారేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని, వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పార్టీ అధిష్టానందే తుదినిర్ణయమని, బీజేపీ విజయం కోసం అందరినీ కలుపుకుని కృషిచేస్తానని కన్నా చెప్పారు. అటు కన్నా నియామకం ఏపీ బీజేపీని కుదిపేస్తోంది.
బీజేపీ మూల సిద్దాంతాలతో సంబంధం లేని కన్నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ నేపథ్యం తప్ప రాజకీయంగా బీజేపీతో కన్నాకు పెద్ద అనుబంధం లేదు. ఆయన పార్టీలో చేరిందే రాష్ట్ర విభజన తర్వాత. ఈ నాలుగేళ్లలోనూ ఏపీ బీజేపీ నేతగా… ఆయన ఏ సందర్భంలోనూ చురుగ్గా వ్యవహరించలేదు. అంతేకాకుండా ఇటీవల ఆయన బీజేపీని వీడి వైసీపీలో చేరనున్నారనీ ప్రచారం సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్నవారిని, పార్టీ గొంతును ప్రజల్లో బలంగా వినిపించే నేతలను కాదని, ఏరికోరి కన్నాను అధిష్టానం ఎంపిక చేయడం… చాలా మంది బీజేపీ నేతల్లో అసంతృప్తికి కారణమయింది. ముఖ్యంగా… ఏపీలో తొలి నుంచీ వాడీవేడీ మాటలతో చంద్రబాబుపై విరుచుకుపడే సోము వీర్రాజుకు కన్నా ఎంపిక ఆశనిపాతంగా మారింది.
కన్నా నియామక వార్త తర్వాత సోమువీర్రాజు ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు. సోము వీర్రాజుకే కాదు… పార్టీలోని ఇతర నేతలకు కూడా కన్నా నియామకం నచ్చడం లేదు. పార్టీ నుంచి ఎంత గొప్ప నేత వెళ్లిపోతున్నా ఆపే సంస్కృతి బీజేపీకి లేదని, గతంలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి కళ్యాణ్ సింగ్, మధ్యప్రదేశ్ లో ఉమా భారతి, కర్నాటకలో యడ్యూరప్ప వంటి నేతలు పార్టీని వీడుతుంటే ఎవరూ బుజ్జగించలేదని, ఆ నేతలు వారంతట వారే తిరిగి వచ్చారని, అలాంటిది బీజేపీ మూలాలే లేని కన్నాను పార్టీ వీడకుండా బుజ్జగించి మరీ… అధ్యక్ష పదవి అప్పగించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. తిరుగుబావుటాను సహించని బీజేపీ అధిష్టానం… ఈ పరిణామాలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.