ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీద హత్యా ప్రయత్నం జరిగిందా ?. ఔను అంటున్నారు స్వయంగా కన్నా లక్ష్మీనారాయణ. అయితే ఇదేదో రహస్యంగా జరిగింది అనుకుంటే పొరపాటే. కేంద్రం మీద టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కన్నా రాష్ట్ర పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో పాల్గొడానికి ఆయన అనంతపురం వచ్చారు. అక్కడే ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలో ఏదో విధంగా రాజకీయ అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కన్నాని కలిసి తమ వాదన వినిపించడానికి ప్రయత్నించగా పోలీసులు , బీజేపీ కార్యకర్తలు అడ్డం పడ్డారు. కాసింత ఉద్రిక్త పరిస్థితులు తరువాత ఎటు వాళ్ళు అటు వెళ్లిపోయారు. అయితే ఈ విషయం మీద మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా తనపై హత్యాప్రయత్నం జరిగిందని ఆరోపించడంతో పాటు ఇలాంటి వాటిని సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని కూడా అన్నారు.
ఇంతకుముందు తిరుమల వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీద కూడా అలిపిరి వద్ద హత్యాప్రయత్నం జరిగిందని అప్పట్లో కన్నా వాదించారు. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా కలిపి ప్రస్తావించారు.
ప్రజాస్వామ్యంలో నిరసనకు ఏ స్థానం వుందో సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న కన్నాకు తెలియదా ?. అలాంటి నిరసన కార్యక్రమాల్ని పట్టుకుని హత్యాప్రయత్నం అని కన్నా ఆరోపించగలరేమో గానీ ఆ విషయం నమ్మడానికి జనం చెవుల్లో పూలు లేవు. ఇప్పటికే విభజన హామీలు నెరవేర్చకుండా ఆ కోపం నుంచి జనం దృష్టి మరల్చడానికి ఏడుకొండలవాడిని సైతం వివాదాల్లోకి లాగుతున్న బీజేపీ ని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. వీటికి తోడు ఇంకా ఇలాంటి హత్యారోపణలు చేస్తే జనం నమ్మడం మాట అటు ఉంచి వారి దృష్టిలో మరీ చులకన కావడం ఖాయం. విభజన సమయంలో ఇలాంటి ప్రయత్నాలు చేసి భంగపడ్డ కాంగ్రెస్ నుంచి వచ్చినా కూడా కన్నా ఆ పాఠాలు , గుణపాఠాలు నేర్చుకోకుండా వ్యవహరించడం ఆశ్చర్యకరమే.