భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడి కన్నా లక్ష్మీ నారాయణ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీజేపీకి అన్నీ అపశకునాలే. నిజానికి ఆయనకి అధ్యక్ష పదవి కట్టపెట్టాలనుకున్నప్పుడే పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత బాధ్యతల స్వీకరణ కూడా హడావుడిగా జరిగిపోయింది. తన హయాంలో పార్టీని నడిపించాలని అధికారం వైపు తీసుకెళ్లాలని కలలు కంటున్న కన్నా లక్ష్మీనారాయణకు ఆది నుంచి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. తొలి పర్యటనగా అనంతపురం వెళ్లిన కన్నా లక్ష్మీ నారాయణను స్ధానిక తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య రణరంగమే జరిగింది.
ఇక ఆ తర్వాత నెల్లూరు పర్యటనకు వెళ్లిన కన్నా లక్ష్మీనారాయణకు అక్కడ కూడా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. అనంతపురంలో ఆయనపై దాడికి ప్రయత్నిస్తే, నెల్లూరు జిల్లాలో ఏకంగా దాడే చేశారు. కావలి పురవీధుల్లో కమలనాధులతో కలిసి ర్యాలీగా వెళుతున్న కన్నా లక్ష్మీనారాయణపై ఒకరు ఏకంగా చెప్పే విసిరారు. అతడ్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశశుద్ధి కూడా చేశారు. ఇలా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడికి వెళితే అక్కడ ఎదురుదాడులే స్వాగతం పలుకుతున్నాయి.
ప్రకాశం జిల్లా ఒంగోలులో… ప్రత్యేకహోదా ప్లకార్డు పట్టుకున్న వ్యక్తిపై బీజేపీ నేతలు దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో… కన్నా లక్ష్మినారాయణ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ డాక్టర్… ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ ఓ ప్లకార్డు ప్రదర్శించారు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్‌ను బీజేపీ నేతలు తరిమి తరిమికొట్టారు. కింద పడేసి కాళ్లతో తొక్కారు. పోలీసులు అడ్డుకుంటున్నా… బీజేపీ నేతలు వెనక్కి తగ్గలేదు. అతి కష్టం మీద పోలీసులు శ్రీనివాస్ ను పోలీసులు తప్పించగలిగారు. కన్నా లక్ష్మినారాయణ వస్తున్నారని తెలిసి… ఆయన పర్యటన జరిగే మార్గంలో నిరసన తెలిపేందుకు ఉదయం నుంచి నల్ల దుస్తులు, ప్లకార్డుతో అదే దారిలో నిలబడ్డారు. కానీ ఎవరూ అడ్డు చెప్పలేదు. కానీ కన్నా ర్యాలీ అక్కడికి వచ్చే సరికి… బీజేపీ నేతలు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. శ్రీనివాస్‌పై దాడి చేశారు. పోలీసులు లేకపోతే బీజేపీ నాయకులు శ్రీనివాస్ ని ఏమి చేసి ఉండేవారో ఊహాతీతమే !