కర్ణాటక రాజకీయం అనేక మలుపులు తిరుగుతూ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ రాజీనామాలపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు విచారించనున్నట్టు సమాచారం. రెబెల్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించనున్నారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. ముంబైలోని ఓ హోటల్లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు అక్కడకు చేరుకున్నారు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మంత్రి డీకే శివకుమార్. అయితే ఆయనను ముంబై పోలీసులు అడ్డుకున్నారు. హోటల్లోకి వెళ్లకుండా భారీగా మోహరించారు. దీంతో వారితో చర్చలు జరిపి సంక్షోభానికి ముగింపు పలకాలన్న ఆయన అశలు అడియాసలైనట్టే కనిపిస్తున్నాయి. మరోవైపు, తమకు ముఖ్యమంత్రి కుమారస్వామిని కానీ, డీకేను కానీ కలిసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు రెబల్ ఎమ్మెల్యేలు. రెబెల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద ఈ నెల 12 వరకు 144 సెక్షన్ విధించారు.