మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి 9:50 గంటలకు బులెటిన్ విడుదల చేసిన కావేరీ ఆసుపత్రి వైద్యులు కరుణ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు ప్రకటించారు. అయితే చికిత్స కొనసాగుతోందని వారు చెబుతున్నా ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖులు ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడే ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఏదో జరగరానిది ఏదోజరిగిందనే భావిస్తున్నారు.
సేలంలో అధికారిక పర్యటనలో ఉన్న సీఎం పళనిస్వామి అర్ధంతరంగా తన పర్యటనను వాయిదా వేసుకుని చెన్నై రావడంతో ఇక ఏదో జరిగిపోతోందన్న భావనతో వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చి ఆసుపత్రిని చుట్టుముట్టారు. మరోవైపు ఈరోజు కరుణానిధిని ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే సీఎం పళని స్వామి నేటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేశారు. తమిళనాడు వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆసుపత్రితోపాటు డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. చెన్నై నగరమంతా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులకు ఉన్నతాధికారులు సెలవులను రద్దు చేశారు. అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని పోలీస్ స్టేషన్లకు హెచ్చరికలు పంపారు.
ఈ అంశాలు అన్నీ చూస్తే కరుణానిధి ఆఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు అర్ధం అవుతోంది. ఏ నిముషాన ఏమి వార్త వినాల్సి వస్తుందో అని తమిళ ప్రజలు, కరుణ అభిమానులు ఆందోళనలో ఉన్నారు. మరికాసేపట్లో సీఎం ఆస్పత్రికి చేరుకుని కరుణానిధిని పరామర్శించనున్నారు. కరుణ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రధాని ఆరా, వెంకయ్య రాక, ఇతర ప్రముఖుల పరామర్శ, వేలాది మంది కార్యకర్తల రోదనలు, డీఎంకే శ్రేణుల్లో కన్నీళ్లు, స్టాలిన్ మొహంలో విషాదం, కళ తప్పిన కనిమొళి మొహం ఇవన్నీ చూస్తున్న కరుణ అభిమానులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. కరుణ ఇంటి దగ్గరకు లక్షలాదిగా కార్యకర్తలు తరలి వస్తుండడంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు లాటీ చార్జ్ సైతం చేస్తున్నారని తెలుస్తోంది.