నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్స్టేషన్లో అధికారులను బెదిరించారంటూ ఎమ్మెల్యేపై పోలీసులు శనివారం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే కొందరు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు. దీంతో వైసీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన అనుచరులతో పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేసారు. నా ప్రోటోకాల్ మీకు తెలుసా అంటూ పోలీసులపై విరుచకుపడ్డారు. డీజీ కంటే నా ప్రొటొకాల్ ఎక్కువ ఎస్పీని డీజీని పిలవండి అంటూ వాగ్వాదానికి దిగారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని స్టేషన్లోనే బైఠాయించారు. పోలీసులపై చిందులు తొక్కుతూ హంగామా చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసారు.
ఇదిలా ఉంటే ప్రశ్నించేందుకు వెళ్తే నాపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. నిన్న రాత్రి నుంచి ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు నెల్లూరు వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసునమోదుచేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థిత నెలకొంది. కాగా ఎమ్మెల్యే అరెస్ట్ సందర్భంగా ఎటువంటి ఆవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.