సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిజానికి 2019 ఏప్రిల్ లో జరగాలి. అయితే ఆ ఎన్నికలు కొన్ని నెలల ముందుగా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇద్దరు చంద్రులు ఇటీవల తమ తమ పార్టీ మీటింగ్స్ లో పదేపదే చెబుతున్నారట. ఎన్నికలు ముందస్తుగా వస్తాయి కాబట్టి అన్ని విధాలుగా సంసిద్ధంగా వుండాలని పార్టీ శ్రేణులకు ఇటు చంద్రబాబు , అటు కెసిఆర్ ఉద్బోధ చేస్తున్నారట. ప్రధాని మోడీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు ఇద్దరు చంద్రులకు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయట.
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ తో కలిసి ప్రయాణం చేసేందుకు టీడీపీ కూడా సిద్ధంగా లేదు. ఇక కెసిఆర్ సంగతి మాత్రం డైలమా లో వుంది. కాంగ్రెస్ రోజురోజుకి బలపడే పరిస్థితి కనిపిస్తున్నందున బీజేపీ గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే తెలంగాణ లో సమీకరణాల దృష్టితో చూసినప్పుడు బీజేపీ కన్నా టీడీపీ తో పొత్తు మేలు చేస్తుందని సర్వేల్లో వెల్లడి అవుతోందట. దీంతో కెసిఆర్ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెరాస, టీడీపీ మధ్య తెలంగాణ లో పొత్తు కుదిరితే ఆ సంచలన సమీకరణం కేవలం తెలుగు రాజకీయాలకే పరిమితం కాబోదు. జాతీయ స్థాయిలో మోడీని ఢీకొట్టే దిశగా సరైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న ప్రాంతీయ పార్టీలు ఈ జోడీ మీద ఆధారపడే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. వ్యూహ, ప్రతి వ్యూహాలు, ఆర్ధిక బలం దృష్ట్యా ఈ ఇద్దరికీ జాతీయ స్థాయి రాజకీయాలకి సారధ్యం వహించే సత్తా వుంది.
ఇద్దరు చంద్రుల మధ్య స్నేహం చిగురించే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ హైకమాండ్ కి కూడా ఎప్పటినుంచో సందేహం వుంది. అందుకే ఈ ఇద్దరినీ దూరంగానే ఉంచుతూ తాను తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూసింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇక ఇద్దరు చంద్రులు తమ హవా కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త సమీకరణాలకు చోటు ఇవ్వకుండా తామే సర్దుకుపోతే బెటర్ అన్నట్టు ఆలోచిస్తోంది. అందుకే పోలవరం మీద కొర్రీ లు పెట్టి పెట్టి చివరగా గుత్తేదారుని మార్చడానికి ఓకే అనేసింది. అయినా బీజేపీ తో ఇద్దరు చంద్రులు కలవకుండా ఉంటేనే మేలని తెలుగు ప్రజానీకం భావిస్తోంది. ఏదేమైనా ఇద్దరు చంద్రులు కలిసి మోడీ మీద రాజకీయ దండయాత్ర చేయొచ్చన్న ఆలోచన కేంద్రం నిర్లక్ష్యానికి గురి అవుతున్న తెలుగు ప్రజలకు భలే కిక్ ఇస్తోంది.