తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ఏ దిశగా వెళ్తుందో, కొడంగల్ నియోజకవర్గం ఇరు పార్టీలకు ఎంతటి ప్రాముఖ్యమో అనేవి కొడంగల్ లో ఈరోజు, రేపు 144 సెక్షన్ అమలవుతున్న తీరు చూస్తుంటే అర్ధమవుతుంది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి విజయం ఖాయమని అక్కడి ప్రజల నాడీ గమనిస్తుంటే తెలుస్తున్నా, రేవంత్ రెడ్డి ని ఎలాగైనా ఓడించి, తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదనే ఆశయంతో, కొడంగల్ విజయాన్ని ప్రతిష్టగా భావించి, పావులు కదుపుతున్నది కేసీఆర్ వర్గం. మొన్నటికి మొన్న కాంగ్రెస్ నేతల ఇండ్లలో పోలీసులు సోదా చేయడంతో, ఇది కేసీఆర్ చేస్తున్న రాజకీయ దురుద్దేశ చర్యే అని రేవంత్ రెడ్డి వాఖ్యానించడంతో పాటు, కొడంగల్ లో ధర్నాకి కూడా దిగారు.
ఎన్నికల ప్రచారానికి గడువు రేపటితో ముగుస్తుండడంతో, కొడంగల్ లో పర్యటించి, తన మాటలు, హామీల మూటలతో ప్రజలని తనవైపునకు తిప్పుకోవడానికి కేసీఆర్ రేపు కొడంగల్ లో పర్యటించబోతున్నారు. తమ పార్టీ నాయకుల మీద దురుద్దేశంగా దాడులు జరుపుతున్నారనే కారణం చేత, కేసీఆర్ కొడంగల్ పర్యటనను ఎలాగైనా విఫలం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి కేసీఆర్ పర్యటించబోయే డిసెంబర్ 4 న బంద్ ని ప్రకటించారు. బంద్ ప్రకటించగానే ఓకే అనడానికి ఇప్పుడున్నవి మామూలు పరిస్థితులు కావు కదా, ఇటువంటి చర్యలు ఎన్నికల ప్రచారంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే అవకాశం కూడా ఉండడంతో, రేవంత్ రెడ్డి బంద్ పిలుపు పైన ఏ విధమైన చర్యలు తీసుకోనున్నారో, ఎటువంటి విచారణ చేపట్టారో ఎల్లుండిలోపు (బుధవారం) తమకు వివరణ ఇవ్వాల్సిందిగా డీజేపీ మహేందర్ రెడ్డి ని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఆదేశించారు. కారణం ఏదైనా కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో వేచి చూడాలి.