టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈరోజు హుస్నాబాద్ నుంచి ప్రజా ఆశీర్వాద సభలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటి ప్రచార సభను ఈరోజు కేసీఆర్ హుస్నాబాద్ వేదికగా ప్రారంభించారు. ఈ సభలో కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడుతూ సమైక్యపాలనలో చిక్కిశల్యమైన తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నానో మీకు తెలుసు. కాంగ్రెస్ నేతల నోళ్లకు హద్దూ, పద్దూ లేదని అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పేదరికానికి కాంగ్రస్ పార్టీ కారణం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలేమైనా గంధర్వులా? పైనుంచి దిగి వచ్చారా? అని ప్రశ్నించారు.
నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని… ఈ అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా? అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నాలుగేళ్ల క్రితమే పుట్టిన పసిబిడ్డ అయిన తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థాయిలో ఉంది. అవినీతి రహితంగా పాలన చేయబట్టి, టీఆర్ఎస్ క్రమశిక్షణతో పాలించబట్టే ఇంతటి ఇభివృద్ధి సాధించిందని ఆయన అన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమని అన్ని పార్టీలు ప్రకటించాయని ఇప్పుడు తీరా వచ్చేసరికి బెంబేలెత్తిపోతున్నాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీని రద్దు చేస్తే, ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని, ఎన్నికలు వచ్చాయంటే అమలు చేయలేని హామీలు ఇవ్వడం కాంగ్రెస్ కు అలవాటేనని అన్నారు. కాంగ్రెస్ నేతలు సమైక్య పాలనలో గళమెత్తి ఉంటే, ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. ఈ ఎన్నికలు రావడానికి కాంగ్రెస్సే కారణమని తెలిపారు. ఢిల్లీకి గులాంల మాదిరి కాకుండా, తెలంగాణకు గులాబీల్లా ఉందామని చెప్పారు.