గత కొద్దిరోజులుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకే ముందు సంకేతాలు ఇచ్చినా తర్వాత అదేమీలేదని మంత్రివర్గ సమావేశంలో క్లారిటీ ఇచ్చారని వార్తలు రాగా తాజాగా తెలంగాణా భవన్ లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ముందుస్తు ఎన్నికలకే తెలంగాణ సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చని.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కేడర్‌కు ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారని సమాచారం. కానీ ఎన్నిక ఎప్పుడనేది తనకు వదిలేయాలని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.
తెలంగాణభవన్‌లో జరిగినవిస్తృత స్థాయి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు బయటకు ఎక్కడా పొక్కకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంత రహస్యంగా ఈ భేటీ జరిగిందంటే సీనియర్ నేతల ఫోన్‌లను సైతం లోపలకు అనుమతించలేదు. సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో జరగబోయే ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకు అందరూ కృషిచేయాలని కేసీఆర్ నేతలకు సూచించారు.. ప్రతి నియోజకవర్గం నుంచి 25వేల మంది తరలివచ్చేలా ఆయా నియోజకవర్గ బాధ్యులు చూడాలని ఆయన నేతలకు సూచించినట్టు తెలుస్తోంది.