తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలా కాకుండానే ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి మీడియా సమావేశంలోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బిగ్గెస్ట్ బఫూన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న హుస్నాబాద్ సభా వేదికగా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన కేసీఆర్ కాంగ్రెస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఇతర పార్టీలు కూడా కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీపై మాటల దాడి ప్రారంభించాయి. బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరతీశారని ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఓవైపు ఎంఐఎం తమకు మిత్రపక్షమని కేసీఆర్ చెబుతుండగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముందస్తుకు వెళ్లి కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని అక్బరుద్దీన్ సోదరుడు, ఎంపీ అసదుద్దీన్ ప్రశంసలు కురిపించగా అక్బరుద్దీన్ అందుకు పూర్తి విరుద్ధంగా ‘నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్‌లో నేను సీఎం అవుతానని కేసీఆర్ అంటున్నారు. చూద్దాం.. ఎవరు సీఎం అవుతారో.. ఎవరి అవసరం ఎవరికి వస్తుందో’ అని అక్బరుద్దీన్ అన్నారు. కర్ణాటకలో హెచ్‌డి కుమారస్వామి ముఖ్యమంత్రిగా కాగాలేనిది తామెందుకు సీఎం కాలేమని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. పాతబస్తీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఎంఐఎం శ్రేణులను ఉత్సాహపరిచారు. ఎవరి అవసరం ఎవరికి వస్తుందో చూద్దామంటూ ఒకరకంగా కేసీఆర్‌కు సవాల్ విసిరారు. సమయం వస్తే ఎలాంటి వారికైనా అవకాశం వస్తుందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడీ మాటలు టీఆర్‌ఎస్ శ్రేణులను షాక్‌కు గురిచేస్తున్నాయి.