Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా తొలి అడుగువేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో కోల్ కతాలోని సచివాలయంలో కేసీఆర్ రెండుగంటలపాటు చర్చలు జరిపారు. అనంతరం ఇరువురూ కలిసి మీడియాసమావేశం ఏర్పాటుచేశారు. తమ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతపై చర్చలు జరిపామని కేసీఆర్ వెల్లడించారు. తమ ఫ్రంట్ ప్రజల ఎజెండాతో త్వరలోనే ముందుకొస్తుందని తెలిపారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని, మమతా బెనర్జీతో తన భేటీ… మార్పు దిశగా తొలిఅడుగని కేసీఆర్ అభివర్ణించారు. చాలామంది మిత్రులు తమతో కలిసివస్తారని ఆశిస్తున్నామని, భవిష్యత్తులో తమదే అతిపెద్ద కూటమిగా అవతరించబోతోందని, దేశ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తామని కేసీఆర్ తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా దేశ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని… ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయశక్తికోసం ఎదురుచూస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని, అందుకే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన పుట్టుకొచ్చిందని చెప్పారు. మమతాబెనర్జీతో జరిగిన చర్చల్లో కొన్ని అంశాలపై అంగీకారం కుదిరిందని, భవిష్యత్తులో మరిన్ని అంశాలపై స్పష్టత ఇస్తామని, తమతో కలిసి వచ్చే మిత్రులందరితో చర్చించి మిగతా అంశాలు వెల్లడిస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు. కేసీఆర్ తో భేటీపై మమతాబెనర్జీ కూడా సంతృప్తి వ్యక్తంచేశారు. దేశం మార్పు కోరుకుంటోందని, బలమైన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. దేశాభివృద్ధి, రైతుల సమస్యలపై కేసీఆర్ తో విస్తృతంగాచర్చించామని, భావసారూప్యత ఉన్న మిత్రులందరితో చర్చలు జరుపుతామని తెలిపారు. దేశంలో నెలకొన్న పరిస్థితులే నాయకులను సృష్టిస్తాయని మమతాబెనర్జీ అభిప్రాయపడ్డారు. మమతాబెనర్జీతో సమావేశంలో కేసీఆర్ తో పాటు ఎంపీలు కేశవరావు, కవితతో పాటు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజీవ్ శర్మ పాల్గొన్నారు.