ముందస్తు ఎన్నికలకి సిద్దమయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ వర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపించారు. శుక్రవారం ఒకేరోజు పలు అంశాల మీద ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ సర్కార్ ముందస్తుకు సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కేసీఆర్ ప్రజలకు వరాల జల్లు కురిపించడం ఇప్పుడు రాష్ట్రంలో వాడివేడి చర్చకు దారితీసింది. ఎస్సీ,ఎస్టీలకు గృహోపయోగ విద్యుత్తును 101 యూనిట్ల వరకూ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. టీవీలతో పాటు ఇతర విద్యుత్ గృహోపకరణాలు పెరిగినందున విద్యుత్ వాడకం ఎక్కువైందని. ..దీనికి అయ్యే ఛార్జీలను ప్రభుత్వమే డిస్కంలకు చెల్లిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఇకపై వేతనాలు చెల్లిస్తామని కేసీఆర్ ప్రకటించారు. వచ్చేనెల 1 నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు అందిస్తామన్నారు. పూజారుల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. అదేవిధంగా మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే ఇమామ్, మౌజమ్‌లకు నెలకు రూ.5వేలు భృతిని వచ్చేనెల 1వ తేదీ నుంచి 21 వేలు చెల్లించనున్నట్లు సీఎం ప్రకటించారు. సీఎం నిర్ణయంతో మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే సుమారు 9వేల మందికి మేలు జరగనుంది.
మినీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. హెచ్ఎం, వార్డెన్‌కు రూ.5వేల నుంచి రూ.21వేలకు పెంచారు. మరోవైపు హైదరాబాద్‌లో అన్నికులాలకు ఆత్మగౌరవ భవనాల్ని నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ మేరకు కోకాపేట, మేడిపల్లి, మేడ్చల్, ఘట్‌కేసర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇంజాపూర్‌లలో భూములు గుర్తించినట్లుగా ఆయన ప్రకటించారు. ప్రతి కులానికి భవనాన్ని నిర్మించడం దేశంలో ఇదే ప్రథమమని కేసీఆర్ చెప్పుకొచ్చారు.