తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దు గురించి నిన్న ప్రగతి నివేదన సభలోనే కేసీఆర్ ప్రకటన చేస్తారని భావించిన కేవలం ఒకే ఒక్క నిముషం ముందస్తు గురించి మాట్లాడారు కేసీఆర్. దీంతో అసలు నిన్న ఎందుకు ప్రకటన చేయలేదు అనే చర్చ మొదలయ్యింది. ఎందుకంటే నిన్న గంట ముందు క్యాబినెట్ భేటీ కూడా జరగడంతో అందులో దీని గురించి అసలు నిర్ణయం తీసుకున్నారా ? లేక మరలా జరగనున్న క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారా ? అనేది ప్రస్నార్ధకంగా మారింది. దీంతో ఇప్పుడు తాజాగా మరో విషయం తెరమీదకు వచ్చింది. నిన్న కేసీఆర్ రద్దు ప్రకటన చేయకపోవడానికి అసలు కారణం కేసీఆర్ జన్మ నక్షత్రం అని తెలుస్తోంది. జాతకాలనీ, జ్యోతిష్యులనీ బాగా నమ్మే కేసీఆర్ గ్రహబలం కోసమే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ప్రచారం సాగుతోంది.
ఆరో తేదీ ఏకాదశి, గురువారం పునర్వసు న క్షత్రం ఆరోజు మధ్యాహ్నం ఒకటిన్నర దాకా ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వస్తుంది. వీటిలో పునర్వసు కేసీఆర్‌కు మిత్ర తార కాగా, పుష్యమి ఇంకా మంచింది కాబట్టి గ్రహబలం రీత్యా అది కేసీఆర్‌కు బాగా కలిసివచ్చే రోజు మిత్ర తార రావడంతో ఆరో తేదీనే అసెంబ్లీ రద్దు చేస్తే బాగుంటుందని పండితులు ఆయనకు సూచించడంతో ఆయన అదే రోజు రద్దు ప్రకటన చేసేందుకు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అదొక్కటే కాక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంలలో డిసెంబరు 15లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. వాటితో కలిసి ఎన్నికలకు వెళ్లాలంటే తెలంగాణలో సెప్టెంబరు 10 లోపునే అసెంబ్లీని రద్దు చేసి ఆ తీర్మానాన్ని ఈసీకి అందజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల కమిషన్‌కు తక్కువలో తక్కువ రెండు నెలలు సమయం అవసరం. ఈ లెక్కలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే అదే రోజున అసెంబ్లీ రద్దు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.