Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవి వివాదాస్పద మరణం కేసులో భారత మీడియా తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దుబాయ్ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి అంశాలనూ అధికారులుగానీ, మీడియా గానీ బయటకు వెల్లడించడానికి వీలులేదు. దీంతో శ్రీదేవి కేసుకు సంబంధించిన వార్తలపై దుబాయ్ మీడియా ఆచితూచి కథనాలు ప్రచురిస్తోంది. భారత్ మీడియాకు అలాంటి నిబంధనలేవీ లేకపోవడంతో అత్యుత్సాహంతో అర్థం లేని కథనాలు వండివారిస్తోంది. జాతీయ మీడియానే కాదు… తెలుగు ఛానళ్లు కొన్ని కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయి. శ్రీదేవి హఠాన్మరణం, భౌతికకాయం అప్పగింతలో జరుగుతున్న జాప్యం, ఫోరెన్సిక్ నివేదికలో కొత్త కోణం వెలుగుచూడడం వంటివన్నీ సంచలనాత్మక విషయాలే. అయితే ఆ వార్తలు అందించే క్రమంలో మీడియా అల్లుతున్న కథనాలే వివాదాస్పదంగా ఉంటున్నాయి. శ్రీదేవి అభిమానులను ఈ కథనాలు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురిచేస్తున్నాయి. దుబాయ్ లో శ్రీదేవి మృతిచెందిన విషయాన్ని మొదటగా ప్రపంచానికి వెల్లడించడంతో పాటు… ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తున్న స్థానిక మీడియా సంస్థ ఖలీజా టైమ్స్ తాజాగా భారత మీడియా తీరుపై ఘాటుగా స్పందించింది.
శ్రీదేవి మృతి విషయంలో ముందుగానే నిర్ధారణకు వచ్చేందుకు, జడ్జి పాత్ర పోషించేందుకు భారత మీడియాలోని కొన్ని సెగ్మెంట్స్ ప్రయత్నిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శ్రీదేవి మృతి తమని కూడా దిగ్భ్రాంతపరిచిందని, అయితే ఎందుకు ఈ కేసులో ముందుగానే ఒక నిర్ధారణకు వచ్చేందుకు తాపత్రయపడుతున్నారని ఖలీజాటైమ్స్ భారత మీడియాను ప్రశ్నించింది. సెలబ్రిటీ ప్యాకెడ్ కల్చర్ లో భాగంగా భారతమీడియాలోని కొన్ని సెగ్మెంట్లు… అధికారులు దర్యాప్తు పూర్తిచేయకముందే జడ్జీల పాత్ర పోషించాలని భావిస్తున్నాయని, విచారణ సమయంలో సంయమనం పాటించడమే ధర్మమని తాము సూచిస్తున్నామని ఖలీజా టైమ్స్ ప్రచురించింది. ప్రముఖ భారతీయ జర్నలిస్ట్ బర్ఖాదత్ కూడా టీవీ చానళ్ల ప్రసారాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో టీవీ చానళ్ల ప్రసారాలు సిగ్గుపడేలా ఉన్నాయని, వార్త మరణం పేరుతో ఆమె వాషింగ్టన్ పోస్టులో ఓ వ్యాసం రాశారు. అటు సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియా తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.