Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తెలుగు తేజం, భారత అగ్రశేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 1980లో ప్రకాశ్ పదుకునే ప్రపంచ నంబర్ వన్ గా నిలిచిన తర్వాత మళ్లీ ఆ ఘనత సాధించింది శ్రీకాంతే… అసలైతే గత ఏడాది అక్టోబర్ లోనే శ్రీకాంత్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును అందుకోవాల్సి ఉంది. గాయం కారణంగా శ్రీకాంత్ అప్పుడు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కామన్ వెల్త్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్లో భారత్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన శ్రీకాంత్ 76,895 పాయింట్లతో ఇప్పుడు అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
52 వారాల వ్యవధిలో అత్యుత్తమ 10టోర్నీల ప్రదర్శన ఆధారంగా బీడబ్ల్యూఎఫ్ ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ పద్ధతి లేనప్పుడు 1980లో ప్రకాశ్ పదుకునే నెంబర్ వన్ గా నిలిచాడు. 38 ఏళ్ల తర్వాత మళ్లీ శ్రీకాంత్ ఆ ఘనతను అందుకున్నాడు. తొలి స్థానాన్ని సాధించిన రెండో భారతీయుడిగా శ్రీకాంత్ నిలిచినందుకు చాలా గర్వంగా ఉందని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. భారతీయ క్రీడారంగానికి ఇవాళ గొప్పరోజన్నాడు. శ్రీకాంత్ కే కాకుండా భారత బ్యాడ్మింటన్ కు ఇదొక గొప్ప విజయమని పుల్లెల గోపీచంద్ సంతోషం వ్యక్తంచేశాడు. ఇప్పటివరకు మనమంతా క్రీడాకారిణుల గురించే మాట్లాడుకుంటున్నామని, ఇప్పుడు మనకు మెన్స్ నంబర్ వన్ కూడా ఉన్నాడని, రానున్న రోజుల్లో శ్రీకాంత్ మరింత మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తాడని గోపీచంద్ అభిప్రాయపడ్డాడు.