మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకు ముహూర్తం దాదాపు ఖరారయిందని తెలుస్తోంది. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి తీసుకు వచ్చేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు జరిపిన మంతనాలు ఫలించినట్టుగా తెలుస్తోంది. పళ్లంరాజు, టీ సుబ్బిరామిరెడ్డి వంటి వారు కిరణ్ రెడ్డిని కలిసి తిరిగి కాంగ్రెస్ లో చేరమని అడిగారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఊమెన్ చాందీ కూడా కలిశారు. తాను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇప్పుడు ముహూర్తం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 13న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈరోజు సాయంత్రం లేక రేపు ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్లో చేరే ముందు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన భేటీ అవుతారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసే విషయాలు, పార్టీలో తాను పోషించాల్సిన పాత్రపై ఆయన చర్చలు జరుపుతారు. తాను పార్టీలో చేరితే పోషించాల్సిన పాత్రపై చర్చలు జరపనున్నారు. తొలుత పార్టీ ముఖ్య నేతలను కలవనున్నారు. ఆ తర్వాత రాహుల్, సోనియా గాంధీలను కలిసి ఓ నిర్ణయానికి వచ్చాక ప్రకటన చేయడం లేదా నేరుగా చేరే అవకాశాలున్నాయి. అయితే ఈ నెల 13న కాంగ్రెస్ పార్టీలో చేరికపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. తాను ఈ వార్తలను టీవీ ఛానెళ్లలో చూసి తెలుసుకుంటున్నానని సెటైర్ వేశారు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.