విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో ఇటీవల చీర చోరీ వ్యవహారం రచ్చరచ్చగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గుడిలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆ దేవస్థానం పాలకమండలి బహిష్కృత సభ్యురాలు కోడెల సూర్యలత. పాలకమండలి సభ్యుడు వెలగపూడి శంకరబాబు, ఓపీడీఎస్‌కు చెందిన మహిళల పట్ల వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపణలు చేశారు. దుర్గ గుడిలో పనిచేసే మహిళలను లొంగదీసుకొనేలా వ్యవహారాలు సాగుతున్నాయని వీటిపై బాధిత మహిళలు ఫిర్యాదులు చేసినా పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు వాటన్నింటినీ తొక్కిపెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇదివరకే వేధింపులకు గురైన ఐదుగురు మహిళలు చైర్మన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ.. వెలగపూడి శంకరబాబుపై చైర్మన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలపాలని ప్రశ్నించారు.
ఇక అమ్మవారి చీరలకు సంబంధించి చాలా అక్రమాలు జరిగాయనీ, వాటిని ప్రశ్నించినందుకు తనపైనే చీర దొంగిలించినట్లు అభాండాలు వేశారని ఆమె వాపోయారు. ‘నేను ఏ తప్పు చేయలేదు, ఎటువంటి ప్రాథమిక విచారణ లేకుండా నాపై దొంగతనం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిలో జరిగే అవినీతిని గురించి మాట్లాడటమే నా నేరమా?’ అంటూ ఆమె ప్రశ్నించారు. చీరల విషయంలో జరుగుతున్న అక్రమాలను నివేదికలుగా మిగిలిపోకూడదని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశానని ఆమె విమర్శించారు. ఇంద్రకీలాద్రి పై అన్ని శాఖల్లో అవినీతి జరుగుతోందని, అన్నదానం లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని శంకర్ శాండిల్య భాగోతాలు మాకు తెలియవా అతను చెప్పింది ఎలా పరిగణలోకి తీసుకొని బయటకు పంపిస్తారు ? అని ఆమె ప్రశ్నించారు.