కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. ఈరోజు సాయంత్రం కర్నూలు జిల్లా కొడమూరులో టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో కోట్ల కుటుంబం టీడీపీ తీర్థం పుచ్చుకుంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో పాటు కోట్ల సూజాతమ్మ, కోట్ల రాఘవేంద్ర రెడ్డికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోట్ల, కేఈ కృష్ణమూర్తి కుటుంబసభ్యులు ఒకే వేదికపైకి ఉండడం ఆ జిల్లా క్యాడర్ కి ప్రత్యేక ఉత్శాం ఇచ్చే మాట వాస్తవం. నిన్న మొన్నటిదాకా పార్టీలోకి రాక ముందు కోట్ల, కేఈ కుటుంబాల మధ్య మొన్నటివరకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అలాంటిది సభా వేదికపై కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కేఈ.. టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా రైతుల కోసం సీఎం చంద్రబాబు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని కోట్ల కొనియాడారు. కర్నూలు జిల్లాలో సాగునీటి సమస్యలు చాలా ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కావాలనేది తన కోరికని ఆయన పేర్కొన్నారు. వైసీపీ బీజేపీతో కుమ్మక్కయ్యిందని అన్నారు. రైతుల కష్టాలు తీర్చే టీడీపీకి ఓటేసి గెలిపించాలని కోట్ల పిలుపునిచ్చారు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు. కాంగ్రెస్ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ను ఎంతో మంది నేతలు వీడినా ఆయన పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. అయితే ఈసారి ఎన్నికల్లో చక్రం తిప్పాలని చూస్తున్న ఆయన వైసీపేతో కూడా చర్చలు జరిపారు అయితే టీడీపీ ఆయనను వదులుకోకుండా ఫాలో అప్ చేసి మరీ పార్టీలోకి చేర్చేసుకుంది.