నిన్న గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోవు ఎన్నికల్లో తెరాస పార్టీ ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి సంచలనానికి తెర తీశారు. సీఎం గా కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఇప్పటివరకు ఎవరూ చేయలేదని, కెసిఆర్ సారధ్యంలో రాష్ట్రము అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కూడా తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ ని విమర్శిస్తూ, టీడీపీ పార్టీ చేస్తున్నవి అవకాశవాద రాజకీయాలని, తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు కాంగ్రెస్ పార్టీ ని బంగాళాఖాతం లో కలిపెయ్యాలని అనుకునేవారో, అలాంటి కాంగ్రెస్ పార్టీ తో చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికలలో తన స్వలాభం కోసం పొత్తు పెట్టుకున్నారని, ఇదే కాకుండా ఇంకా అవసరం అనిపిస్తే ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తో కూడా పొత్తు పెట్టుకునేందుకు వెనుకాడరని చంద్రబాబు నాయుడు ని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెరాస పార్టీ విజయం సాధిస్తుందని, మళ్ళీ సీఎం గా కెసిఆర్ గద్దెని ఎక్కుతారనే విశ్వాసం ప్రకటించారు.
ఉద్యమకారుడిగా కెసిఆర్ ఎంతపేరు సాధించారో అంతకు కొన్ని రెట్లు మంచి పాలకుడిగా తనని తాను నిరూపించుకున్నారని తెలిపారు. తెలంగాణ వాళ్లకు పరిపాలన రాదని వెక్కిరించినా ఆంధ్ర నేతల నోర్లు మూయించేలా కెసిఆర్ తెలంగాణ లో పరిపాలన చేశారని కొనియాడారు. అంతేకాకుండా, తనకి ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఎంతమాత్రమూ లేదని, ఇంకో మూడు ఎన్నికల వరకు కెసిఆర్ సీఎం గా ఉండాలని, తనకి దక్కిన ఈ పదవులే చాల పెద్ద బాధ్యత గా భావిస్తున్నాని కేటీఆర్ తెలిపారు. డిసెంబర్ 11 తరువాత తెరాస అధికారంలోకి రావడం తధ్యం అని జోస్యం చెప్పారు.