Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేరెళ్ల ఘటన తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వరుస ప్రమాదాలకు కారణమౌతున్న ఇసుక లారీల్ని తగలబెట్టినందుకు.. ఎవరు బాధ్యులో తెలుసుకోకుండా దొరికినవారిని దొరికినట్లుగా పోలీస్ స్టేషన్లో పడేసి కుమ్మడంపై జాతీయ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. అటు బాధితులు కూడా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఘటన జరిగిన పదిహేను రోజుల వరకూ కేటీఆర్ వారి పరామర్శకు కూడా వెళ్లలేదు.
అయినదానికీ, కానిదానికీ ట్విటర్లో పోస్టులు పెట్టే కేటీఆర్.. నేరెళ్ల వెళ్తున్నట్లు మాత్రం బయటకు పొక్కనీయలేదు. పైగా ఎవరి కంటా బడకుండా నేరెళ్ల బాధితుల్ని వేములవాడ ఆస్పత్రిలో పరామర్శించి వచ్చారు. అంటే ఆయన వెళ్లింది వేములవాడ నియోజకవర్గానికే కానీ.. సొంత ఇలాకాకు కాదు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆస్పత్రి నుంచి నేరెళ్ల వెళ్లే సాహసం కేటీఆర్ చేయకపోవడం విపక్షాలకు అందివచ్చిన అవకాశంగా మారింది.
దీనికి తోడు మీడియాకు ముందస్తుగా సమాచారం ఇవ్వనందుకు క్షమించాలని కేటీఆర్ కోరారు. ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించే కేటీఆర్.. ఈసారి తగ్గారని, భయపడ్డారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అధికారం తమ జన్మహక్కు అన్నట్లుగా మాట్లాడే కేటీఆర్ .. వేములవాడ ఆస్పత్రి దగ్గర మాత్రం జనం దయతలచి ఓట్లేస్తేనే అధికారం అనుభవిస్తున్నామని వాస్తవం ఒప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
మరిన్ని వార్తలు: