Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేటీఆర్ బయట ఎలా ఉంటారో అలా భరత్ అను నేనులో ముఖ్యమంత్రి పాత్రను చిత్రీకరించామని మహేశ్ బాబు చెప్పారు. సినిమాలో సీఎం పాత్రను ఎలా చేద్దామని దర్శకుడు కొరటాల శివను తాను అడగ్గా…కేటీఆర్ బయట ఎలా ఉంటారో చూడాలని, అప్పుడప్పుడు బయట టీషర్ట్ లు కూడా వేసుకుని తిరుగుతారని శివ తనకు చెప్పారని తెలిపారు. సినిమాకు ముందు కేటీఆర్ బిహేవియర్ ను పరిశీలించామని చెప్పారు. దీన్ని బట్టి దర్శక హీరోలు డైరెక్ట్ గా ఆ మాట ప్రస్తావించలేదు కానీ…భరత్ అను నేనులో ముఖ్యమంత్రి పాత్రకు కేటీఆర్ నే స్ఫూర్తిగా తీసుకున్నట్టు భావించవచ్చు. కేటీఆర్ కు కూడా సినిమా చాలా నచ్చింది. సినిమా చూసిన ఆయన చిత్రబృందాన్ని ప్రశంసించారు.
కొరటాల శివ సామాజిక అంశాలపై సినిమాలు తీస్తున్నారని, ఓవైపు సందేశం, మరోవైపు సక్సెస్ కావాలంటే సినిమాలో కచ్చితంగా నాటకీయత ఉండాలని, దాన్ని దర్శకుడు తీసుకున్నారని కేటీఆర్ ప్రశంసించారు. సినిమాలో చెప్పిన జవాబుదారీ తనం తనకు బాగా నచ్చిందని, దాంతో పాటు లోకల్ గవర్నెన్స్, విద్యా,వైద్యం,మీడియా అంశాలను బాగా చూపించారని కేటీఆర్ కొనియాడారు. లోకల్ గవర్నెన్స్ ను సీఎం కేసీఆర్ త్వరలోనే అమలుచేయబోతున్నారని తెలిపారు. మీడియాతో రోజూ తాము పడే బాధను కూడా చూపించినందుకు ధన్యవాదాలు చెప్పారు. సినిమా చూసి అభిప్రాయం తెలిపినందుకు కేటీఆర్ కు మహేశ్ బాబు ధన్యవాదాలు తెలిపారు. భరత్ అను నేను బృందాన్ని కేటీఆర్ అభినందించడం చాలా గర్వంగా ఉందని అన్నారు. కేటీఆర్ ఎప్పుడు తన సినిమాలు చూసినా తనకు టెన్షన్ అని, బాగుంటే బాగుందని చెప్తారని, లేకపోతే లేదని…ఆగడు సినిమా సమయంలో …స్టాప్ డూయింగ్ నాన్సెన్స్ లైక్ దిస్ అని క్లియర్ గా చెప్పారని, కేటీఆర్ అంత నిజాయితీగా ఉంటారని గుర్తుచేసుకున్నారు. తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని, కొరటాల శివకు మాత్రం రాజకీయాలపై మంచి పట్టుందని, ఎప్పుడో ఒకప్పుడు ఎమ్మెల్యే కావాలన్నది కొరటాల ఆకాంక్షని మహేశ్ చెప్పుకొచ్చారు.