Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక తెలంగాణ ఉద్యమమే బాటగా చేసుకుని అధికార పీఠాన్ని అధిష్టించిన టీఆర్ఎస్ ఇప్పుడు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో కొత్తగా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెరపైకి తెచ్చింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం త్వరలో జరగనున్న పార్టీ ప్లీనరీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పేరును ప్రకటించే అవకాశముంది. కేసీఆర్ కుమారుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఈ పదవిని కట్టబెట్టనున్నట్లు పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈనెల 27న మేడ్చల్‌లో జరిగే పార్టీ ప్లీనరీలో ఈ మేరకు కొత్త బాధ్యతల్ని అప్పగించడం దాదాపు ఖాయమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే 2015 ప్లీనరీ నుండే ఈ పదవిని ఆయనకు కట్టబెడతారని ప్రచారం జరిగినా సీఎం కేసీఆర్ మేనల్లుడు, పార్టీలో రెండో స్థానంలో ఉన్న హరీశ్‌రావును పక్కన పెడుతున్నారని నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తం కావడంతో అప్పటి నుండి ఆ పదవిని ప్రకటించలేదు. పార్టీలో అనవసర విభేదాలకు అవకాశం కల్పించకూడదనే ఉద్దేశ్యంతో వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లాన్‌ను అప్పటికి వాయిదా వేశారు. అయితే పార్టీ పదవి లాంటిది ఏదీ లేకుండానే మంత్రి కేటీఆర్ పార్టీపై పూర్తి పట్టు సాధించేందుకు అన్ని నియోజకవర్గాల్లోనూ విస్తృత పర్యటనలు చేస్తూ ప్రతి జిల్లాలోనూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటూ వచ్చారు అదే సమయంలో మంత్రి హరీశ్‌రావు తన శాఖా బాధ్యతలు చూసుకుంటూ తన నియోజకవర్గానికి, తదుపరి తన జిల్లాకే పరిమితం అయి పనిచేసుకుంటూ వచ్చారు.
మరో పక్క సీఎం కేసీఆర్ తీసుకునే ఏ నిర్ణయమైనా తనకు శిరోధార్యమేనని హరీశ్‌రావు ఇప్పటికే అనేకసార్లు బహిరంగంగానే చెప్తూ వస్తున్నారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పోటీ లేకుండానే కేటీఅర్ కి అప్పగించేందుకు సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తన అవసరం ఉందనుకుంటే ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ఇంతకు ముందే ప్రకటించడంతో మంత్రి కేటీఆర్‌కు అధికారం కట్టబెట్టడం ఇక లాంఛనమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల ఇక ఏడాది మాత్రమె ఉండటంతో పార్టీపై పట్టు కోసం ప్రగతి యాత్రల పేరుతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాలు చుట్టి వస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారు కాబట్టి… కేటీఆర్ ఏ ముఖ్యమంత్రి కూడా అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఆరంగేట్రంలో భాగంగా మేనల్లుడు హరీశ్‌రావును కూడా తనవెంట తీసుకెళ్తారనే మరో వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇక రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ కి అడ్డు లేకుండా చేసినట్లు అవుతుంది.