ఏపీ లోనూ తెరాస వేలు పెడుతుందంటున్న కేటీఆర్ – నిజమెంత…?

KTR Shocking Comments On TRS Leaders

చూస్తుంటే తెలంగాణ ఎన్నికల ప్రచారం రసకందాయంలో పడ్డట్టుగా ఉంది. అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తున్న ప్రజలను ఎటు మొగ్గాలో తెలియని ఇరకాటంలో పడేస్తున్నాయి. సూటిగా విమర్శించడంలో కేసీఆర్ దే అందె వేసిన చేయనుకుంటే, కేటీఆర్ తండ్రిని మించిన తనయుడు గా ప్రజల మధ్య నిర్వహించే సభల్లో, సోషల్ మీడియాలో, నేషనల్ మీడియా తోటి ఇంటర్వ్యూలలో, ఎక్కడ అవకాశం ఉందనిపిస్తే అక్కడ ప్రత్యర్థుల్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అలా అని ఆషామాషీ విమర్శలు కాకుండా ప్రజలను మరోసారి ఆలోచించుకోమన్నట్లుగా సాగుతున్నాయి కేటీఆర్ విమర్శల ప్రహసనం. ఈరోజు హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భరత్ నగర్ లో నిర్వహించిన ప్రచారంలో చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేస్తూ, తెరాస పార్టీ భవిష్యత్తులో చేయాలనుకుంటున్న కార్యాచరణలో ఒకటిని బహిర్గతం చేశారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు ని అమరావతికి తరిమికొట్టామని, మళ్ళీ తెలంగాణ వచ్చిన చంద్రబాబు కొత్త వేషాలు వేయాలని చూస్తే, తెరాస పార్టీ ఏపీలో కూడా వేలుపెట్టి, చంద్రబాబు కి తెలుగు రాష్ట్రాల్లో అడ్రస్ లేకుండా చేస్తామని కేటీఆర్ చంద్రబాబుని హెచ్చరించినంత పనిచేశారు.

chandra-babu-naidu-and-ktr

కేసీఆర్ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఆధిపత్యం చూపించే దిశగా ఫెడరల్ ఫ్రంట్ ని ఏర్పాటుచేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా తెలుగురాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ లో కూడా పట్టు సాధించే దిశగా కేసీఆర్ అడుగేయబోతున్నారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏపీ సంక్షేమం గురించి ఆలోచిస్తుందే కానీ తగాదాలకు తావు ఇవ్వబోదని స్పష్టం చేసిన కేటీఆర్, చంద్రబాబు నాయుడు తన దగ్గరున్న సొమ్ముని, మీడియాని అడ్డం పెట్టుకొని తెలంగాణాలో రాజకీయాలు చేస్తున్నారని, ఆయన ఎన్ని వేషాలు వేసిన ప్రజలు పట్టించుకోరని, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే మహానాయకుడు కేసీఆర్ కే మళ్ళీ పట్టం కట్టి, తమ రాష్ట్రాన్ని కాపాడుకుంటారనే విశ్వాసం వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉందికానీ, మోడీలా దేశాన్ని పాలించాలన్న కేసీఆర్ ఉబలాటమే ఫెడరల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేయాలనుకోవడానికి గల కారణం అని, ఇక ఆ ఫ్రంట్ పెట్టి, ఢిల్లీ గల్లీల వెంబడి తిరగాల్సిన పరిస్థితిలో రాష్ట్రాన్ని ఏమి పాలిస్తారని ప్రజకూటమి విమర్శలు చేస్తే, కేటీఆర్ ఏమి జవాబిస్తారో చూడాలి.

KTR Controversial Comments On Chandrababu