నిన్నటినుండి మన లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ గారికి, కల్వకుంట్ల తారకరామారావు గారికి ట్విట్టర్లో ఒక చిన్నపాటి ట్వీట్ల యుద్ధమే నడుస్తుంది. విషయానికి వస్తే జెపి గారు తన పాటికి తాను ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్లో ఉన్న విషయం ఏమిటంటే “కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి లక్షకోట్లు ఖర్చవుతుంది. మళ్ళీ దాన్నినిర్వహించడానికి ప్రతి సవంత్సరం 20 వేల కోట్లు ఖర్చవుతుంది. ఈ భారామంతా పెద్ద ప్రజలు, టాక్సులు కట్టే బడుగు జీవుల మీదే పడుతుంది. ఈ విషయం మీద అసెంబ్లీలో అయితేనేమి, బయట గల్లీలలో అయితేనేమి నేనే నా గొంతు వినిపిస్తున్నాను కానీ ఇంకే రాజకీయ పార్టీ కనీసం నోరు కూడా మెదపడం లేదు.
దీనికి నేను చింతిస్తున్నాను”. ఇది విని ఎల్లప్పుడూ ట్వీటర్ లో అందుబాటులో ఉండే మన ప్రియతమా మాజీ మినిస్టర్ అయినా కేటీఆర్ గారు స్పందించకుండా ఊరికే ఉండరుగా. వెంటనే కాళేశ్వరం గురించి తన కాసింత సమాచారం ఇస్తున్నట్టుగా ఇస్తూ ఇలా చెప్పారు. ఇంతకీ కేటీఆర్ గారు చెప్పిందేమిటంటే “జెపి గారు…కాళేశ్వరం ప్రాజెక్ట్ కి అవుతున్న ఖర్చు 80 వేల కోట్లు మాత్రమే. అయినా, ఉత్పాదక రంగాలలో చేసే ఖర్చుని పెట్టుబడిగా పరిగణించాలి గాని రుణంగా పరిగణిస్తున్నారేమిటండీ? ” అంటూ తెలంగాణ GSDP మీద ఏవో సామాన్య ప్రజలకి అర్ధం అవ్వని కొన్ని లెక్కలు చెప్పారులెండి. కేటీఆర్ కామెంట్ కి రిప్లై ఇవ్వకుంటే మన జెపి గారు తెలివైన వారు ఎలా అవుతారు చెప్పండి. అందుకేనేమో కేటీఆర్ గారు కామెంట్ చేసిందే తడువుగా గంటల్లోనే మరో రిప్లై తో బాణాన్ని సంధించారు. ఈ రిప్లై ట్వీట్లో జెపి గారు చెప్పిందేమంటే “ఖర్చు పెట్టినదానికి తగిన ఫలాలు లభిస్తాయని నేను ఆశిస్తున్నాను.
కానీ, ప్రజల డబ్బుని ఖర్చు చేసినదానికి మనం ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలని పొందాలి. మీరు చేసిన ఖర్చుకి, కలిగిన ప్రయోజనాలకి విశ్లేషణాత్మక వివరణ నిజాయితీతో బహిరంగంగా చర్చిస్తే చాలా బాగుంటుంది”. ఏమాటకామాటే, ఎవరికైన తగిన సమాధానాలు ఇవ్వడంలో కేటీఆర్ గారే దిట్ట అనుకుంటే, ఇప్పుడు మన జేపీ గారు ఏమాత్రం తీసిపోవడం లేదుకదా. అయినా ఇద్దరు తెలివైన వాళ్ళు చర్చింకుంటే అది చూస్తూ, వింటున్న మూడో వాడికి లాభం అన్నట్టు ఇది ఒక మంచి పరిణామం గానే కనిపిస్తుంది.