Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పాకిస్థాన్ జైలులో మరణశిక్ష అనుభవిస్తున్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కు సంబంధించి మరో వీడియోను పాక్ అధికారులు విడుదల చేశారు. అయితే ఇది మోసపూరిత వీడియోగా భావిస్తున్నారు. ఈ వీడియోలో కులభూషణ్ చెప్తున్న మాటలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. తనను కలుసుకున్న సమయంలో తన తల్లి కళ్లల్లో భయం కనిపించిందని, తనను చూసి ఆమె ఏడుస్తుంటే ఆ సమయంలో భారత రాయబారి గట్టిగా అరిచారని, ఆయన ఆమెను అరవడం తాను చూశానని కులభూషణ్ ఈ వీడియోలో వ్యాఖ్యానించారు. తల్లి, భార్యతో తన సమావేశం సానుకూలంగా జరిగిందని, దీని వల్ల తన తల్లి సంతోషంగా ఉందని చెప్పారు. దీంతో పాటు ఈ వీడియోలో పాకిస్థాన్ తనతో వ్యవహరిస్తున్న వైఖరిపై కులభూషణ్ చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
పాకిస్థాన్ జైలులో తాను సంతోషంగా ఉన్నానని, తన గురించి ఆందోళన పడొద్దని, పాక్ అధికారులు తనను చాలా బాగా చూసుకుంటున్నారని, ఎలాంటి చిత్రహింసలకు గురిచేయడం లేదని పాక్ విదేశాంగ శాఖ విడుదల చేసిన ఈ వీడియోలో కులభూషణ్ వ్యాఖ్యానించారు. అలాగే భారతప్రభుత్వానికి, ప్రజలకు, నేవీ అధికారులకు తాను ఒక విషయం చెప్పదలచుకున్నానని, భారత నేవీలో తన ఉద్యోగం పోలేదని, తాను ఇంకా భారత నేవీ అధికారినే అని జాదవ్ వీడియోలో మాట్లాడారు. కులభూషణ్ భారత అధికారిగా గూఢచర్యానికి పాల్పడ్డాడని ప్రపంచానికి తప్పుడు ప్రచారం చేయడానికే పాకిస్థాన్ ఆయనతో ఈ వ్యాఖ్యలు చేయించినట్టు అర్ధమవుతోంది.
కులభూషణ్ ను ఆయన తల్లి, భార్య కలుసుకున్నప్పటి ఫొటోలో ఆయన తలపైనా, చెవి వద్ద గాయాలున్న ఆనవాళ్లు కనిపించాయి. కులభూషణ్ ను పాక్ హింసింస్తోందనడానికి ఇదే నిదర్శనమని భారత్ చేస్తున్న వాదనను తిప్పికొట్టేందుకే స్యయంగా ఆయనతో పాక్ అధికారులు తనను బాగా చూసుకుంటున్నారని చెప్పించినట్టు భావిస్తున్నారు. కులభూషణ్ కు ఆయన తల్లి, భార్యను వితంతువుల మాదిరిగా చూపించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడం, ప్రపంచ దేశాలు సైతం పాక్ తీరును తప్పుబడుతున్న నేపథ్యంలో పాక్ ఈ మోసపూరిత వీడియో నాటకం ఆడినట్టు తెలుస్తోంది. అటు పాక్ ఈ వీడియో విడుదల చేసిన కాసేపటికే భారత్ ఆ దేశాన్ని దోషిగా చూపించే కీలక ఆధారాలు బయటపెట్టింది.
కుల భూషణ్ ను పాకిస్థాన్ అక్రమంగా బంధించిందని అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు కావాల్సిన ఆధారాలను ప్రకటించింది. పాక్ ఆర్మీకి అత్యంత సన్నిహితంగా ఉండే జైషే ఉల్ అదల్ అనే ఉగ్రవాదసంస్థ కులభూషణ్ ను ఇరాన్ లో కిడ్నాప్ చేసి పాక్ కు అప్పగించినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ముల్లా ఒమర్ అనే ఇరానీ సంతతి ఉగ్రవాది చబహార్ అనే ప్రాంతంలో కులభూషణ్ ను కిడ్నాప్ చేసి పాక్ ఆర్మీకి అప్పగించాడు. ఈ ఉగ్రవాద సంస్థ పాక్ ఆర్మీకి సాయంగా ఇరాన్, బహ్రెయిన్ ల్లో పనిచేస్తుంటుంది. బలూచిస్థాన్ పోరాట వీరులను అణిచివేసేందుకు పాక్ ఆర్మీతో కలిసి ఈ ఉగ్రవాద సంస్థ అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడింది. అటు కులభూషణ్ ను ఇరాన్ లో జైషస్త్ర ఉల్ అడల్ కిడ్నాప్ చేసి పాకిస్థాన్ కు అప్పగించిన విషయాన్ని కొన్ని రోజుల క్రితం బలోచ్ నేత హిర్బయేర్ మారి కూడా ధృవీకరించారు.