Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పాకిస్థాన్ లో మరణశిక్షను ఎదుర్కొంటున్న కులభూషణ్ జాదవ్ గురించి బలూచిస్థాన్ నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కులభూషణ్ గూఢాచారని, తమ దేశంలో అక్రమంగా అడుగుపెట్టిన ఆయన్ను బలూచిస్థాన్ లో అరెస్టు చేశామన్నది పాకిస్థాన్ వాదన. అయితే పాక్ చెప్పే ఈ మాటల్లో ఏ మాత్రం నిజం లేదంటున్నారు బలోచ్ నేత హిర్బయేర్ మారి. కులభూషణ్ ను బలూచిస్థాన్ లో అరెస్టు చేయలేదని, ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి పాక్ తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు. కొన్ని మతపరమైన సంస్థలు కులభూషణ్ ను ఇరాన్ నుంచి తీసుకొచ్చి పాక్ బలగాలకు అప్పగించాయని ఆయన తెలిపారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు.
అప్ఘాన్ లోని బలూచ్ శరణార్థులను మతపరమైన అతివాదులు అపహరించి ఐఎస్ ఐ లేదా పాక్ సైన్యానికి అమ్ముతుంటారని మారీ చెప్పారు. 1970,80ల్లో తాలిబన్ ఉగ్రవాదులు బలోచ్ శరణార్థులను చంపేసి, వారి తలలు నరికేవారని, ఆ ఫొటోలను ఐఎస్ఐ లేదా పాక్ సైన్యానికి పంపేవారని… అలా వారి నుంచి ఉగ్రవాదులు డబ్బులు తీసుకునేవారని వెల్లడించారు. కులభూషణ్ కుటుంబ సభ్యులతో పాక్ అమానవీయ వైఖరిపైనా మారి స్పందించారు. ఈ ఘటనతో బలోచ్ మహిళల పట్ల పాక్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో ప్రపంచ దేశాలకు అర్ధమవుతుందన్నారు. కన్నకొడుకును చూసేందుకు భారత్ నుంచి వచ్చిన ఓ మహిళతోనే పాక్ అలా ప్రవర్తించిందంటే ఇక బలోచ్ ఖైదీలు, మహిళలు, చిన్నారుల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో అర్దం చేసుకోవచ్చన్నారు. ఖైదీలను వేధించేందుకు దేశవ్యాప్తంగా రహస్య జైళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. అక్కడ విచారణసమయంలో చాలా మంది ఖైదీలు చనిపోతారని, కానీ వారు ఎలా మరణిస్తారో ఎవరికీ తెలియదని మారీ అన్నారు.