Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామి ఊహించినట్టే విశ్వాస పరీక్షలో గెలుపొందారు. విధాన సభలో శుక్రవారం నిర్వహించిన బలపరీక్షకు ముందే బీజేపీ వాకౌట్ చేయడంతో మూజువాణి ఓటుతో జేడీఎస్ – కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించారు. కుమారస్వామికి 117 మంది సభ్యుల మద్దతు లభించింది. జేడీఎస్-కాంగ్రెస్ సభ్యులంతా బలపరీక్షకు మద్దతుగా చేతులెత్తారు. బలపరీక్షలో కుమారస్వామి నెగ్గినట్టు స్పీకర్ మూడుసార్లు చదివి వినిపించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో స్పీకర్ సభను ముగించారు. కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.
అంతకుముందు కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప అసెంబ్లీలో ఉద్వేగ భరితంగా మాట్లాడారు. కాంగ్రెస్ – జేడీఎస్ నేతలు అపవిత్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 37 సీట్లు సాధించిన జేడీఎస్ ప్రభుత్వం ఎలా ఏర్పాటుచేస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రజాభీష్టానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని, సీఎం సీటుకోసం కుమారస్వామి దిగజారుడు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. జేడీఎస్ కు 16 జిల్లాల్లో అసలు సీట్లే దక్కలేదని, గతంలోనూ కుమారస్వామి ఇలాంటి రాజకీయాలే చేశారని, అలాంటి జేడీఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని విమర్శించారు. రాజ్యాంగ ద్రోహులు మీరా… మేమా అని యడ్యూరప్ప ప్రశ్నించారు. కుమారస్వామి తీరుకు నిరసనగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కుమారస్వామి అమలుచేయాలని, 24 గంటల్లో రైతు రుణమాఫీ అమలు చేయకపోతే ఈ నెల 28న కర్నాటక బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం తాము సభనుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. విశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రసంగించారు. కర్నాటక ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో కలిసి జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే విశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ప్రజలకు మంచి పాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. హంగ్ అసెంబ్లీ కర్నాటకకు కొత్తేమీ కాదని, 2004లో కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర సంక్షేమం కోసమే తమ కూటమి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.