స్పీకర్ కోడెలకు కేవీపీ ఘాటైన లేఖ

Kvp ramachandra rao wrote letter to ap speaker kodela

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీరును తప్పుబడుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మరో లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి స్పీకర్ కోడెలకు 26 ప్రశ్నలతో లేఖ రాశారు. కోడెల శివప్రసాద్‌రావు స్పీకర్ పదవిలో ఉండి పోలవరంపై అసత్యాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పోలవరం ఘనత మాదేనని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కేవీపీ వ్రాసిన లేఖ యదాతధంగా
రాజ్యాంగ పదవిలో ఉన్న మీ ద్వారా ప్రభుత్వం తప్పుడు గణాంకాలను ఇచ్చి అనుకూలంగా ప్రచారం చేయించుకొంటున్నదని.. దీని ద్వారా ఉన్నతమైన మీ పదవికి కళంకం ఏర్పడే అవకాశం ఉన్నదని.. కాబట్టి ఆ గణాంకాలను ఆధారంగా చేసుకొని “శాసన సభాధిపతి” గా పత్రికలతో మాట్లాడే ముందు వాటిని కొంచెం పరిశీలించి వాటిలో తప్పొప్పులను గ్రహించమని.. నేను మీకు లేఖ రాస్తే.. మీరు ఆ లేఖకు కూడా సమాధానాన్ని మళ్ళీ ప్రభుత్వం వారితోనే రాయించి.. మళ్ళీ ఆ సమాధానంలో కూడా కనీసం నిజానిజాలను గ్రహించకుండా..అసత్యాలు, అర్ధసత్యాలతో నాకు పత్రికా ముఖంగా సమాధానం ఇవ్వడం చూస్తుంటే.. మీ నిస్సహాయత పట్ల జాలి కలుగుతున్నది.

kvp
ఇక పోలవరం అంటే కేవలం “హెడ్ వర్క్స్” మాత్రమేనని మీరు- మీ తరుపున సమాధానాలు రాస్తున్న ప్రభుత్వం వారు అనుకోవడాన్ని అవగాహనా రాహిత్యం అనుకోవాలో లేదా ప్రజల పట్ల నిర్లక్ష్యం అనుకోవాలో విజ్ఞులు మీరే చెప్పాలి. ఇక మీరు చెపుతున్నట్లు ప్రభుత్వం వారు వారం-వారం ఇస్తున్న ప్రగతి నివేదికల్లోనే పోలవరం ప్రాజెక్ట్ మొత్తం ఐదు భాగాలుగా అంటే.. హెడ్ వర్క్స్, ఎడమ కాలువ, కుడి కాలువ, పవర్ హౌస్ మరియు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలుగా విభజించ బడి.. ఈ అయిదు విభాగాల్లో ప్రగతిని విడివిడిగా చూపెడుతున్నారనే విషయం గ్రహించలేకపోవడం విచారకరం.

Kvp-ramachandra-rao-wrote-l

రేస్ గుర్రాల దృష్టి పక్కకు పోకుండా రహదారిపై మాత్రమే ఉండేలా వాటి కళ్ళకు బ్లైండర్ లు కట్టి వాటిని అదుపుచేసినట్లు.. ప్రభుత్వం కూడా మీ దృష్టి పోలవరం హెడ్ వర్క్స్ నుంచి పక్కకు చూడకుండా..ఒక ప్రత్యేక కళ్ళజోడు ద్వారా చూపిస్తుందా అనే అనుమానం కలుగుతున్నది. లేకపోతే అపార రాజకీయానుభవం.. ముఖ్యంగా “ఇరిగేషన్ మంత్రిగా” చేసిన మీ అనుభవం మీ తోడుగా ఉండగా.. పోలవరం పనులు గత నాలుగేళ్లుగానే జరుగుతున్నాయని మీరు ఎలా చెప్పగలరు? “అయ్యా.. మీరు చెప్పింది తప్పు” అని నాలాంటి వారు చెప్పిన తరువాత కూడా ఎలా సమర్ధించు కోగలరు? ఇంకా.. ఇరిగేషన్ ప్రాజెక్ట్.. ముఖ్యంగా అంతరాష్ట్రీయ ప్రాజెక్ట్ విషయంలో.. ప్రాజెక్ట్ డిజైన్ ల రూపకల్పన, అనుమతి వంటి వాటి ప్రాముఖ్యతను మీరు ఎలా మరిచిపోగలరు? పోలవరం అంటే హెడ్ వర్క్స్ మాత్రమే అనే హ్రస్వ దృష్టిని ఎలా ప్రదర్శించగలరు? .. ఆ కళ్ళజోడు తీసి చూస్తే.. సత్యం మీకు బోధపడి ఉండేది. కానీ మీపార్టీ లో మీ వంటి సీనియర్ నాయకులు.. అందులో శాసనసభాధిపతిగా..పాలను పాలుగా- నీళ్లను -నీళ్లు గా చెప్పవలసిన రాజ్యాంగ హోదాలో ఉన్న మీరు కూడా నిస్సహాయం గా ప్రభుత్వం వారు ఇచ్చినవి చదవ వలసిన పరిస్థితి.. మీ భవిష్యత్ రాజకీయావసరాలు అటువంటివి.. నేను అర్ధం చేసుకోగలను. కానీ, సామాన్య ప్రజలు.. పోలవరం గురించి, దాని ప్రగతి గురించి..కాస్తో..కూస్తో తెలిసినవారు.. మీ మాటలు, లేఖలు చూసి.. అయ్యో “కోడెల” గారు కూడా “ఇంతేనా” అనుకొంటారనే నా ఆవేదన.

kvp
ఇక పోలవరం విషయంలో మీకు ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే తప్పుడు సమాచారమే ఇస్తున్నదని.. ఈ విషయంలో కనీసం మీ పదవికి ఉండే గౌరవాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవడం లేదని.. హైకోర్ట్ లో నేను ప్రజా ప్రయోజన వ్యాజ్యం లో కేంద్రం కౌంటర్ వేసిందని మీకు చెప్పడం తోనే రుజువయింది. ఈ రోజుకు కేంద్రం ఆ కేసు లో కౌంటర్ వేయనేలేదు. కానీ, ప్రభుత్వ మాటలు నమ్మి..”మాట్లాడే చిలుకలా” మీకు ప్రభుత్వం నేర్పిందే పలికారు. ప్రభుత్వం మీకు తప్పుడు సమాచారం ఇస్తోంది.. మీరు దాన్ని కనీసం పరిశీలించకుండా వల్లెవేస్తున్నారనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణలు అవసరం లేదు.

kvp
ఇక పోలవరం గురించి తెలుసుకోవడానికి.. ఎలా అయినా మీరు ప్రభుత్వం పైనే పూర్తి గా ఆధారపడుతున్నారని, ఇక వారు ఇచ్చిందే సర్వస్వం అని భావించి దానినే “పెద్ద బాలశిక్ష” గా భావిస్తున్నారు అని స్పష్టం అయ్యింది కాబట్టి.. పోలవరం గురించి తెలుసుకోవలసిన విషయాలు మీకు ప్రశ్నల రూపంలో పంపుతున్నాను.. వీటికి సమాధానాలు ప్రభుత్వ అధికారుల ద్వారా “ముఖ్యమంత్రి- జల వనురుల శాఖా మంత్రి” గార్లతో సంబంధం లేకుండా.. మీరు తెప్పించి చూసుకొంటే.. మీరు పత్రికలవారితో ఏమి చెప్పినా కనీసం పోలవరం విషయంలో వాస్తవాలు మీకు అవగతం అయి మీ అపోహలు తొలిగే అవకాశం ఉన్నది.

kvp
1) ఏదైనా నదిలో రాష్ట్రాల వారీగా నికర జలాల ఖరారు అయినా తరువాతనే.. ఆ నదిపై ఆ జలాలను వాడుకోవడానికి నిర్మించే ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు, ముఖ్యంగా ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ కు అనుమతి ఇస్తారనే విషయం మీకు తెలుసా?
2) బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రాలకు నికర జలాల కేటాయింపులు జరిపిన తరువాత – వెంటనే పోలవరం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంజయ్య గారు కాదా?
3) 1981-2004 ల మధ్య దాదాపు 16 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా పోలవరం గురించి ఆలోచించిందా?
4) 1996-2004 మధ్య కాలంలో ఎప్పుడైనా అప్పటి గౌరవ ముఖ్యమంత్రిగారు పోలవరం అనే మాటను ఉచ్చరించినట్లు మీకు గుర్తు ఉందా? వారికి అప్పటికి పోలవరం ఎక్కడ ఉందో కనీసం తెలుసనీ ససాక్ష్యంగా చెప్పగలరా?
5) వారు కాకపోయినా.. 1996-97 లలో ఇరిగేషన్ మంత్రిగా చేసిన కాలంలో అయినా.. కనీసం మీరు పోలవరం గురించి ఆలోచించడం గానీ, పోలవరానికి వెళ్లడం గానీ జరిగిందా?
6) మీకు గతంలో కడియం శాసనసభ్యులు గా పనిచేసిన వడ్డి వీరభద్ర రావు గారి గురించి..వారు పోలవరం ప్రాజెక్ట్ గురించి 90వ దశకంలోనే ఢిల్లీకి సైకిల్ యాత్ర చేసిన సంగతి..పోలవరానికి ఘనత వహించిన ఇప్పటి ముఖ్యమంత్రిగారు అడ్డుపడ్డ విధానం గురించి చెప్పిన సంగతి మీకు తెలుసా?
7) ఇప్పుడు మీ పార్టీ శ్రేణులచేత కృష్ణ-గోదావరి నదుల సంగమ రూపశిల్పిగా, ఆపర భగీరధుడుగా కీర్తించబడుతున్న ఇప్పటి ముఖ్యమంత్రి గారి ముందుచూపు 1996 -2004 ల మధ్య మందగించడానికి, ఆయన కార్యదక్షత మూగపోవడానికి కారణం ఏమిటి?
8) 2004కు ముందు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం సాధించిన అనుమతులు ఏమిటి? 2004-2014 ల మధ్య సాధించిన అనుమతులు ఏమిటి? ప్రాజెక్ట్ కు కేంద్ర జల సంఘం, పర్యావరణ మంత్రిత్వ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ప్రణాళిక సంఘం ఎప్పుడు అనుమతించాయి?
9) అప్పటి అఖిలభారత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు పోలవరం ప్రాజెక్ట్ ప్రాధాన్యతను తెలుసుకొని- ప్రాజెక్ట్ ను రెండు సార్లు అంటే 27.09.2005 న ఒకసారి, 14.03.2008 న ఒకసారి సందర్శించిన మాట వాస్తవం కాదా? జాతీయ స్థాయి నాయకురాలు అయి ఉండి కూడా ఆమె ప్రాజెక్ట్ ను రెండు సార్లు ప్రత్యక్షంగా సందర్శించడానికి వస్తే.. ముఖ్యమంత్రి గాని, ఇరిగేషన్ మంత్రి గాని కనీసం ఒకసారి అయినా పోలవరాన్ని 2004 లోపు కనీసం ఎక్కడుందో కనుక్కొన్నారా? ఈవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయఅధ్యక్షులు సైతం ప్రాజెక్ట్ ను సందర్శించడం- ప్రాజెక్ట్ పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి ని.. తెలుగు దేశంవారు పోలవరం పట్ల చూపిన నిర్లక్ష్యాన్ని రుజువు చేయడం లేదా?
10) 2014 కు ముందు పోలవరం హెడ్ వర్క్ లో కేవలం 179 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి కేవలం 2% పని మాత్రమే పూర్తి చేసినట్లు చెప్పిన మీరు పోలవరం పై 31.03.2014 నాటికి ఖర్చు పెట్టిన మిగతా 4957 కోట్లు ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టింది. ఆ నిధులతో ఏ ఏ పనులు పూర్తి చేసింది..ఎందుకు చెప్పడం లేదు? ఆ పనులు పోలవరానికి సంబంధించినవి కావా? వాటి వివరాలు ప్రభుత్వం మీకు ఇవ్వలేదా?
11) పోలవరం ఎడమ కాలువ పొడవెంత.. దానిలో భూసేకరణ, కాలువల తవ్వకం తో సహా పనులు ఏ మేరకు 2014 నాటికి పూర్తి అయినాయి? భూసేకరణతో సహా ఈ పనులు పూర్తి చేయడానికి 2014 ముందు ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత? తరువాత మిగిలిన పని భూసేకరణ తో సహా పూర్తి చేయడానికి ఇప్పటి ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత? ఈ పెరిగిన వ్యయం ఎవరివల్ల పెరిగింది? అదేవిధంగా పోలవరం కుడి కాలువపై భూసేకరణ, కాలువల తవ్వకం తో సహా 2014 కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత? తరువాత ఇప్పటి ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత?
12) 2014 కు ముందు కోర్ట్ లకు వెళ్లి కాలువలు తవ్వకుండా స్టే లు తెచ్చిన వారు మీ పార్టీ వారు కాదా?
13) పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడంతో పాటు.. పోలవరాన్ని expedient public interest ఉన్నప్రాజెక్ట్ గా కేంద్రమే చేపట్టి పూర్తి చేయాలని యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో చెప్పిన విషయం మీ దృష్టికి వచ్చిందా?
14) పోలవరం ముంపు మండలాలను ఆంధ్ర లో కలపడానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఆర్డినెన్సు ను యూపీఏ కాబినెట్ 02.03.2014 న జరిగిన సమావేశంలో ఆమోదించిన విషయం వాస్తవం కాదా?
15) విభజనచట్టం ప్రకారం కేంద్రమే చేపట్టి పూర్తి చేయవలసిన కారణంగా, పోలవరం పూర్తి ఖర్చును కాలక్రమేణా పెరిగే ధరలకు అనుగుణంగా అదనపు భారం తో పాటు, కొత్త భూసేకరణ చట్టం 2013 వల్ల పెరిగే అదనపు భారం కూడా కేంద్రమే భరించేట్లు అప్పటి యూపీఏ ప్రభుత్వం 01.05.2014 న జరిగిన కాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నది నిజం కాదా?
16) పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పిపిఏ) ని ఏ కారణం తో కేంద్రం ఏర్పాటు చేసింది.. దానికి నిర్దేశించిన బాధ్యత ఏమిటి? ప్రస్తుతం పీపీఏ చేస్తున్న పని ఏమిటి? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన ఏడు మీటింగ్ ల మినిట్స్ మీరు చూసారా? పీపీఏ అధికారులు ప్రాజెక్ట్ ను అప్పచెప్పమని, పదే పదే రాష్ట్రాన్ని కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రాజెక్ట్ పనులు పీపీఏ కు అప్పగించలేదు?
17) విభజనచట్టం ప్రకారం కేంద్రమే చేపట్టి పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ను రాష్ట్రం, కాస్ట్ ఎస్క్ లేషన్ భారం ఒప్పుకొని “ప్రత్యేకం గా కోరి” తీసుకోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం కోసం ప్రత్యేక హోదా తో సహా అనేక విభజన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పణంగా పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ అత్యుత్సాహం కారణంగా రాష్ట్రం పై పడే అదనపు భారాన్నిరాష్ట్రం తన స్వంత నిధులతో భరించగలదా? అసలు ఈ భారాన్ని రాష్ట్రము మోయవలసిన అవసరం ఉన్నదా? అసలే విభజన వల్ల ఆర్థికం గా నష్టపోయిన రాష్ట్రంపై ఈ భారం వేయడం ముఖ్యమంత్రి బాధ్యతా రాహిత్యం కాదా?
18) ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి నోట్ లో గాని, ఆ తరువాత ఇచ్చిన అనేక పార్లమెంట్ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలతో గానీ, ప్రాజెక్ట్ “రాష్ట్ర ప్రభుత్వ కోరిక మీదనే” రాష్ట్రానికి ఇచ్చామని చెప్పినా.. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ సాక్షిగా నిండు శాసనసభలో..” ప్రాజెక్ట్ మేము అడుగలేదు.. కేంద్రమే మాకు ఇచ్చింది” అని అసత్యాలు చెపితే మీరు ఏమిచేశారు? గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభను, ప్రజలను మీ సాక్షిగా తప్పుదోవ పట్టించినా..ముఖ్యమంత్రి గారి పై చర్య తీసుకోకుండా మౌనం గా ఉన్నది వాస్తవం కాదా? ఈ మౌనానికి కారణం మీ నిస్సహాయత కాదా?
20) ప్రాజెక్ట్ కు సవరించిన అంచనాలు కేంద్రానికి ఆగష్టు 2017 లోనే సమర్పించినా, అవి ఈనాటికి కేంద్రం ఆమోదించకపోవడానికి కారణం ఏమిటి?
21) పూర్తిగా కేంద్రమే భరించాల్సిన ప్రాజెక్ట్ ఖర్చు ను ముందు రాష్ట్రం తన నిధులనుంచి ఖర్చు పెట్టి, తరువాత కేంద్రానికి బిల్లులు సమర్పించి వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి రావడానికి కారణం ఎవరు? అన్ని కండిషన్ లకు ఒప్పుకొని ప్రాజెక్ట్ ను తీసుకొని.. ఇప్పుడు కేంద్రం నిధులు ఇవ్వడం లేదనడం.. తప్పు ను పక్కవారి పై తోసి రాజకీయం గా లబ్ది పొందాలనుకోవడం కాదా?
22) ఒక పక్క కేంద్రం 2013 -14 అంచనాల ప్రకారమే నిధులు ఇస్తామంటే ఒప్పుకొని.. హెడ్ వర్క్ కాంట్రాక్టర్ నుంచి కొన్ని పనులు తొలగించి.. ముఖ్యమంత్రి గారు తమకు కావలసిన వారికి ప్రస్తుత రేట్ ల ప్రకారం పనులు అప్పగిస్తున్న విషయం వాస్తవం కాదా? ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్రం పై ఇప్పటివరకు పడ్డ అదనపు భారం ఎంత?
23) కాంట్రాక్టర్ ల మీద ప్రేమతో..వారికి నష్టం జరగకూడదని రాష్ట్రం జీవో 22 మరియు జీవో 63 లను విడుదల చేసి, కాంట్రాక్టర్ లకు ప్రెస్ వేరియేషన్ పేరుతో లేబర్, మెటీరియల్ మరియు ఇతర కంపోనెంట్ లపై అదనంగా నిధులు చెల్లిస్తున్న విషయం మీకు తెలుసా? దీని వల్ల రాష్ట్ర ఖజానాపై పడ్డ భారం ఎంతో అంచనా వేయగలరా?
24) నేను హై కోర్ట్ లో పోలవరం పై వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో..కేవలం నేను కోరింది కాస్ట్ ఎస్క్ లేషన్ భారం కూడా రాష్ట్రం పై పడవేయకుండా పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి సహాయ, పునర్నిర్మాణ, పునరావాస కార్యక్రమాల ఖర్చుతో సహా విభజన చట్టం ప్రకారం కేంద్రమే భరించాలని మాత్రమే.. ననీ మీకు తెలుసా?
25) ఆ కేసులో కేంద్రం కౌంటర్ వేసిందని మీకు చెప్పింది ఎవరు? ఈ సమాచారాన్ని నాకు లేఖ రాసేముందు మీరు వెరిఫై చేసుకున్నారా? లేదా ఎవరో చేతికొచ్చింది రాస్తే.. మీరు గుడ్డిగా సంతకం పెట్టారా?
26) ఆ కేసులో రాష్ట్రం తరుపున.. ఏజీ మెమో అఫ్ అప్పీరెన్స్ దాఖలు చేసినంత మాత్రాన.. సరిపోతుందా? ..నాలుగు వారాలలో కౌంటర్ వేయమని కోర్ట్ వారు చెప్పి 9 నెలలు అయినా ఈనాటికీ రాష్ట్రం ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు?.. ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా? రాష్ట్రం కౌంటర్ వేయకపోతే.. కోర్ట్ వారి పరిశీలనలో ఉన్నది ఏమిటి?
27) పోలవరాన్ని ఉచిత బస్సులు, భోజనాలు ఏర్పాటు చేసి చూపమని ప్రజలు ఎవరైనా కోరారా? పోనీ.. అనుచితంగా ఈ “ఉచితాలకు” ఖర్చు పెడుతున్న ధనం ప్రజలది కాదా? ఈ ధనం ముఖ్యమంత్రిగారి ఇంటి నుండి గాని, జలవనురుల శాఖా మంత్రి గారి జేబు నుండి గాని ఖర్చు పెడుతున్నారా? ప్రజాధనాన్ని అడ్డగోలు ప్రచారాలకు ఉపయోగించుకొంటూ.. ప్రభుత్వం దుబారా చేస్తుంటే.. దాన్ని గొప్పగా మీరు చెప్పడమేమిటి?
28) రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్ధిక విధానాలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి చేస్తున్న కొత్త ప్రయోగాలు, బాధ్యతా రాహిత్యం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిన వైనం, కాంట్రాక్టర్ ల లబ్ది కోసం తీసుకొన్న అడ్డగోలు నిర్ణయాలు, భవిష్యత్తులో రాష్ట్రం చేసిన అప్పులపై కట్టవలసిన వడ్డీ ఎలా పెరుగుతున్నదో.. కాగ్ కళ్ళకు కట్టినట్లు చెప్పి.. శాసనసభలో మీ ముందు ఉంచిన తరువాత కూడా.. మీకు కనీసం దానిని చూసే టైం దొరకలేదా.. లేదా చదివినా పైకి చెప్పే ధైర్యం చేయలేక పోతున్నారా?
ఈ ప్రశ్నలకు మీకు సరి అయిన సమాధానాలు ప్రభుత్వం వారు ఇవ్వరు. ఏది ఏమైనా.. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించనందు వల్ల, పీపీఏ కు సహకరించనందు వల్ల మాత్రమే 2018 నాటికి పూర్తి అవ్వవలసిన ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇంకా ముఖ్యమంత్రి గారి అత్యాశ కారణంగానే రాష్ట్రం పై అదనపు భారం పడింది. ఇలా పోలవరం విషయంలో తప్పు మీద తప్పు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు వెనక వేసుకు రావడం, వాస్తవాలు తెలుసుకోకుండా.. ప్రభుత్వం చూపించిన రంగుల కళ్లద్దాలు ద్వారా చూసి.. ఆంతా బాగుందనడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ విషయంలో చేసిన కృషిని మరుగున పడవేయాలని ప్రయత్నించడం- మీ లాంటి సీనియర్ నాయకులకు, ముఖ్యంగా తటస్థంగా వ్యవహరించవలసిన రాజ్యాంగ పదవులను అలంకరించిన వారికి శోభనివ్వదు.
మీ పార్టీకి , మీ ప్రభుత్వానికి “అనుచిత ప్రచారం” చేయవద్దని నేను చెప్పను. కాకపోతే.. నిష్పాక్షికంగా వ్యవరించవలసిన శాసనసభాధిపతి స్థానంలో ఉండి.. ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని నడిపే వారికి లేని గొప్పతనాన్ని ఆపాదించాలని అనుకోవడం..అంతా వారి వల్లే జరుగుతున్నదని చెప్పడం, వారి మెప్పు పొందాలనిచూడడం, ఇతర పార్టీల వారు చేసిన కృషిని తక్కువచేసి మాట్లాడుతూ వారిని తూలనాడడం, రాష్ట్రాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించడం..అభ్యంతరకరం.. ఒక సారి పరిశీలించండి. లేదా భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా మీకు ఈ “భజన” తప్పదనుకొంటే.. కనీసం శాసనసభాధిపతి పదవి గౌరవం పోకుండా.. ఈ “భజన” ఎలా చేయవచ్చో పరిశోధించి, కనిపెట్టి, ఆ విధంగా చేసి.. ..ఆ పదవి గౌరవం నిలుపుతారని ఆశిస్తూ……
భవదీయుడు

(డా. కె.వి.పి.రామచంద్ర రావు)

శ్రీ కోడెల శివప్రసాద్ గారు,
గౌరవ సభాపతి, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ,
శాసనసభా ప్రాగణం, వెలగపూడి, గుంటూరు జిల్లా