Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లగడపాటి సర్వే అంటే ఇక తిరుగులేదు. ఆయన సర్వేలో తేలిన విషయాలు నూటికి నూరుపాళ్లు నిజం కాకపోయినా… దాదాపుగా ఆయన చెప్పినట్టే జరుగుతుంటాయి. 2009 సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి లగడపాటి రాజగోపాల్ చేయిస్తున్న సర్వేలు ఎప్పుడూ తప్పుకాలేదు. కొన్ని సీట్లు, ఓట్లు అటూఇటుగా ఎన్నికల ఫలితాలు ఆయన చేయించిన సర్వేకు తగ్గట్టుగానే వచ్చాయి. అందుకే ఆయన సర్వేలంటే రాజకీయ పార్టీలకే కాదు… సామాన్య ప్రజలకు గురి. మరి ఈ సర్వే రాయుడు నంద్యాల ఉప ఎన్నిక గురించి ఏమి చెప్పారు…
నంద్యాలలో అధికార, ప్రతిపక్ష బలాబలాలపై లగడపాటి సర్వే చేయిస్తున్నారనగానే అందరి దృష్టి దానిపైనే నెలకొంది. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెలువడే ముందు తన సర్వే నివేదిక బయటపెడతానని కూడా లగడపాటి సన్నిహితులకు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే చాలా రోజుల కిందటే సర్వే పూర్తిచేశారు. అయితే నంద్యాల బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగటంతో… దీనిపై స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని లగడపాటి భావించారు. దీంతో మరోసారి సర్వే నిర్వహించారు. ఇప్పుడా సర్వే నివేదిక లగడపాటి సన్నిహితుల ద్వారా బయటకు వచ్చింది. జగన్ సభ తరువాత ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి శిల్పామోహన రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని సర్వేలో వెల్లడయినట్టు సమాచారం. జగన్ సభకు ముందే అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డే ఉప ఎన్నికలో గెలుస్తారని లగడపాటి సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. అయితే సభ తరువాత టీడీపీకి ఓట్ల శాతం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు సర్వేలో తేలింది. జగన్ తో పాటు ఆ పార్టీ నాయకురాలు రోజా పైనా నంద్యాల ప్రజలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. తమ ఆడపడుచుగా భావించే శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియను రోజా అదేపనిగా విమర్శించటం కూడా వైసీపీ పట్ల స్థానిక ప్రజల్లో వ్యతిరేకత పెంచుతోందట. మొత్తానికి అధికార, ప్రతిపక్షాలు రెండూ సర్వశక్తులూ ఒడ్డిన ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరించనుందో తెలుసుకోటానికి మరికొన్ని రోజులు ఆగక తప్పదు.
మరిన్ని వార్తలు: