దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అనేకమంది అనేకరకాలుగా పిలుస్తారు. కొందరు వివిదాస్పద దర్శకుడు అని, మరికొందరు సంచలన దర్శకుడని అంటుంటారు. తన సినిమాలు, వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలిచే వర్మ నిజానికి సినిమా జనంలోనే ప్రత్యేకమైన వ్యక్తని చెప్పొచ్చు. హిట్ సినిమాలు లేకపోయినా… వైభవం అంతా గతంగా మారినా… ఆయనకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. వర్మ వ్యాఖ్యలు, చేష్టలు ఎప్పుడూ వార్తల్లో విషయాలే. సంచలన విషయాలను మాట్లాడుతూ ఎప్పుడూ సంచలనాత్మకంగా ఉండడం వల్లేమో ఆయనలో ఓ నారదుడు కనిపించాడు… దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి. ఓ వెబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పై ఆయన కుమారుడు బాలకృష్ణ తీయనున్న బయోపిక్, వర్మ తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాలపై ఆమె స్పందించారు.
బాలకృష్ణ ప్రయత్నాన్ని అభినందించారు. తన భర్త జీవితంలోని విజయగాథలను మాత్రమే చూపిస్తానని బాలయ్య చెప్పారని, ఆయన జీవితం మొత్తాన్ని సినిమాగా చూపించాలని తానేమీ కోరుకోవడం లేదన్నారు. వర్మ తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మాత్రం లక్ష్మీపార్వతి విభిన్నంగా స్పందించారు. రాంగోపాల్ వర్మ పేరు చెబితేనే వివాదాలని, నారదుడు బహుశా ఈ జన్మలో వర్మ రూపంలో పుట్టిఉండవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. వివాదాలకు పుట్టిల్లయిన వ్యక్తి సినిమా తీస్తే, వివాదాలు కాకుండా మరేం ఉంటాయని ఆమె ప్రశ్నించారు. దెయ్యాల సినిమాలు తీసి జనాలను భయపెట్టిన ఆయన, సమాజానికి మెసేజ్ ఇచ్చేలా ఒక్క సినిమా కూడా తీయలేదని విమర్శించారు.
ఛార్మీని డ్రగ్స్ కేసులో విచారణకు పిలిస్తే, ఆమెను ఝాన్సీ లక్ష్మీభాయ్ తో పోల్చడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయన దారి తప్పిన మేధావి అనిపిస్తోందని, ఆయన తన తెలివిని మంచికి వినియోగిస్తే బాగుండేదని లక్ష్మీపార్వతి అన్నారు. నిజానికి బాలకృష్ట తీస్తున్న బయోపిక్ కన్నా…వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమానే …లక్ష్మీపార్వతి జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం నుంచి ఆయన మరణం వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించనున్నారు. ఈ సినిమా కోసం లక్ష్మీపార్వతి అనుమతి కూడా ఇచ్చారు. సినిమాకు వైసీపీ అండదండలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీకే చెందిన లక్ష్మీపార్వతి వర్మను విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.