ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చమత్కారం నిండిన మాటలకు పెట్టింది పేరు. ప్రసంగాల్లో సైతం ఆయన వేసే చణుకులు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. దాణా కుంభకోణం కేసులో సీబీఐ కోర్టులో దోషిగా నిర్దారణ అయి జైలులో ఉన్నప్పటికీ..ఆయన హాస్య చతురత తగ్గలేదు. గురువారం కోర్టులో లాలూకు, న్యాయమూర్తి శివపాల్ సింగ్ కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. జైలులో చలిగా ఉంది అని లాలూ వ్యాఖ్యానించగా..ఆ మాటలకు న్యాయమూర్తి కూడా వెంటనే కౌంటర్ వేశారు. అయితే తబలా వాయించు అని న్యాయమూర్తి అనగానే అక్కడ నవ్వులు విరిశాయి. లాలూ రికార్డు మొత్తాన్ని తాను పరిశీలించానని, నిఘా పక్కాగా ఉన్నట్టయితే దాణా కుంభకోణం జరిగేది కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
సకాలంలో తగినరీతిలో ఆయన స్పందించలేదని శివపాల్ సింగ్ చెప్పగానే లాలూ జోక్యం చేసుకుంటూ తాను కూడా న్యాయవాదినే అన్నారు. కోర్టు రూమ్ నుంచి లాలూను బయటకు తీసుకొస్తుండగా…న్యాయమూర్తిని ఉద్దేశించి లాలూ కూల్ మైండ్ తో ఆలోచించాలని కోరారు. 21 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత దాణా కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు లాలూని దోషిగా నిర్దారించింది. ఆయనతో పాటు మరో 15 మంది ఈ కేసులో దోషులుగా తేలారు. 1991 నుంచి 1994 మధ్య జరిగిన దాణా కుంభకోణం 1997లో వెలుగులోకొచ్చింది. అప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ తన పదవికి రాజీనామా చేసి భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేశారు.