కత్తి మహేశ్ ఆరోపించినట్టుగా అజ్ఞాతవాసి ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్ కు కాపీయేనా…? అవుననే అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు జెరోమ్ సాలీ. గత రాత్రి లీ బ్రాడీలోని మెట్రో 4 థియేటర్ లో 7.45 గంటల షో చూసిన జెరోమ్ ట్విట్టర్ లో స్పందించారు. తాను సినిమాను చూశానని, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ సినిమా తనకు కూడా నచ్చిందని, అయితే దురదృష్టవశాత్తూ ఈ సినిమా కథ, తన చిత్ర కథకు చాలా దగ్గరగా ఉందని చెప్పారు. పలు జాతీయ, అంతర్జాతీయ వార్తాసంస్థలు జెరోమ్ ట్వీట్ ను ప్రముఖంగా పేర్కొన్నాయి.
ఈ చిత్ర కథపై తమకు స్పష్టత ఇవ్వాలని లార్గో వించ్ భారత హక్కులను సొంతం చేసుకున్న టీ-సిరీస్ నుంచి అజ్ఞాతవాసి నిర్మాతలకు ఇప్పటికే నోటీసులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల కాపీ రైట్ చట్టాలను అనుసరించి జెరోమ్ కూడా అజ్ఞాతవాసి దర్శక నిర్మాతలపై కేసు వేస్తారా, లేదా అన్నది తేలాల్సి ఉంది. అజ్ఞాతవాసి పై ట్రైలర్ విడుదలకు ముందే కత్తిమహేశ్ ఆ సినిమా లార్గో వించ్ కు కాపీఅని ఆరోపించాడు. త్రివిక్రమ్ కాపీ దెబ్బకి రెండోసారి ఒకే ప్రొడక్షన్ హౌస్ బలిఅయ్యిందట పాపం. నవలని, పాత సినిమాని ఎత్తేస్తే కాస్త ఖర్చుతో పోయింది. ఈసారి ఏకంగా యూరోపియన్ సినిమా. వాళ్ల కరెన్సీ యూరోలు మరి. ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా…!!! అని కామెంట్ చేశాడు.