Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎట్టకేలకు శ్రీదేవి చివరి ఫొటో బయటకు వచ్చింది. ఆదివారం ఉదయం శ్రీదేవి మరణవార్త తెలిసిన దగ్గరనుంచి ఆమె చివరిచూపు కోసం దేశంలోని కోట్లాదిమంది ప్రజలు ఎదురుచూస్తుండగా… కపూర్ కుటుంబం మాత్రం వివాదాస్పదంగా వ్యవహరించింది. అనేక అనుమానాలు, అపోహల నేపథ్యంలో మరణించిన మూడురోజుల తర్వాత రాత్రి సమయంలో శ్రీదేవి భౌతిక కాయం ప్రత్యేక విమానంలో ముంబై చేరుకుంది. అక్కడినుంచి మీడియా కంటపడకుండా అంబులెన్స్ లో ఆమె మృతదేహాన్ని స్వగృహానికి తరలించారు. మూడురోజులుగా అభిమానులు, మీడియా ఆమె ఇంటివద్ద పడిగాపులు కాస్తున్నా… వారెవరికీ శ్రీదేవి పార్థివదేహాన్ని చూసే అవకాశం దక్కలేదు. ఈ ఉదయం సెలబ్రేషన్స్ క్లబ్ లో ఉంచిన తర్వాత శ్రీదేవి భౌతికకాయం దగ్గరకు మీడియాను అనుమతిస్తారని అంతా భావించారు. కానీ కపూర్ కుటుంబం మాత్రం… మీడియాను లోపలికి అడుగుపెట్టనివ్వలేదు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి వచ్చిన సెలబ్రిటీలు మాత్రం శ్రీదేవికి నివాళులర్పించారు. చివరిలో శ్రీదేవి భౌతికకాయాన్ని అంతిమయాత్రకు తరలించే ముందు మాత్రం కొందరు మీడియా ప్రతినిధులను కెమెరాలు, సెల్ ఫోన్లు లేకుండా లోపలకి అనుమతించారు.
అనంతరం మధ్యాహ్నం రెండుగంటల తర్వాత శ్రీదేవి అంతిమయాత్ర మొదలయింది. శ్రీదేవి కోరిక ప్రకారం ఆమె అంతిమయాత్రలో అన్నీ తెల్లనిపూలు వాడారు. భౌతికకాయం ఉంచిన వాహనం మొత్తాన్ని తెల్లని పూలదండలతో అలంకరించారు. వాహనం ముందుభాగంలో శ్రీదేవి ఫొటో ఉంచి… ఆ ఫొటోకు కూడా తెల్లని పూలు వేశారు. అంతిమయాత్ర మొదలుకాగానే జాతీయ, ప్రాంతీయ చానళ్లన్నీ ప్రత్యక్షప్రసారం చేశాయి. ఆ క్రమంలోనే ఏఎన్ ఐ ఎక్స్ క్లూజివ్ విజువల్ ఒకటి విడుదల చేసింది. శ్రీదేవి మృతదేహం పక్కన ఆమె భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ, ఇతర కుటుంబసభ్యులు నిల్చుని ఉండగా… శ్రీదేవి భౌతికకాయంపై జాతీయ జెండా కప్పారు. ఈ విజువల్స్ ను అన్ని చానల్స్ ప్రసారం చేశాయి. కాసేపటికి… శ్రీదేవి ముఖానికి సంబంధించి క్లోజ్ ప్ షాట్ ఒకటి విడుదలయింది. సినిమాలోనూ, నిజజీవితంలోనూ మేకప్ ఇష్టపడే శ్రీదేవిని చివరిఘట్టంలోనూ ఆమె కుటుంబసభ్యులు మేకప్ తోనే సాగనంపారు. తీర్దిదిద్దిన ఐబ్రోస్, వాటి మధ్య ఎర్రని బొట్టు, పెదాలకు లిప్ స్టిక్ తో… కళ్లు మూసుకుని ఉన్న ఆమె ముఖం చూస్తుంటే.. మరణించినా… శ్రీదేవి అందం చెక్కుచెదరలేదనిపిస్తోంది. శ్రీదేవికి ఇష్టమైన మెరూన్, గోల్డ్ కలర్ కాంబినేషన్ చీర ఆమె శరీరం మొత్తం కప్పిఉంది… మెడలో ఓ పెద్ద నగ కూడా ఉంది. శ్రీదేవికి సంబంధించి ఇదే ఆఖరి ఫొటో. చరిత్రలో మిగిలిపోయేది ఇక ఈ ఫొటోనే. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ గా మారింది. శ్రీదేవి చివరిసంతకంగా సంబోధిస్తూ ఈ ఫొటోను అభిమానులు షేర్ చేసుకుంటున్నారు.