ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ఏపీ సీఎం కుమారుడు, నారా లోకేష్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనే అంశం ఆసక్తిగా మారింది. లోకేష్‌ను ఉత్తరాంధ్ర నుంచి పోటీచేయించాలని భావిస్తున్న చంద్రబాబు.. విశాఖజిల్లా భీమిలి నుంచి బరిలోకి దించుతారని ప్రచారం జరిగింది. మళ్లీ మారిన సమీకరణాలతో.. తాజాగా మరో నియోజకవర్గం పేరు తెరపైకి వచ్చింది. చినబాబును విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా విశాఖ ఉత్తర టిక్కెట్ ఆశిస్తున్న నేతలు చంద్రబాబును కలిశారట. ఆ నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తారని.. ఆయనకు సహకరించాలని సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ టిక్కెట్‌ను ఆశించిన మాజీ ఎంపీ సబ్బంహరి పేరును మాడుగులకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు తనయుడే పోటీ చేస్తుండడంతో ఆశావహులు కూడా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. లోకేష్ పోటీచేసే స్థానంపై రకరకాల ప్రచారం జరిగింది.
చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల పేర్లు తెరపైకి వచ్చాయి. కుప్పం నుంచి లోకేష్‌ను పోటీ చేయించి.. చంద్రబాబు అమరావతి పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని ముందు చర్చ జరిగింది. తర్వాత గుంటూరు జిల్లాలో పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి.. మళ్లీ కృష్ణాజిల్లా పెనమలూరు ఖాయమని ప్రచారం జరిగింది. చివరికి విశాఖ జిల్లాకు మారింది. ఈ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పట్టు ఉంది. సామాజిక వర్గం కూడా ఆ పార్టీకి కలిసివస్తోంది. దీనికి తోడు సంక్షేమ పథకాలకు ఆదరణ లభిస్తుండడంతో టీడీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమనే భావనలో ఉన్నారు. విశాఖ లో ఐటీ అభివృద్ధి, ఇతర సెంటిమెంట్లు టీడీపీకి కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.