ఛీ ఛీ… బస్టాండ్ ని కూడా వదలరా ?

Lovers Romance in Vijayawada Bus stand waiting Room

అగ్గిపుల్లా, సబ్బు బిళ్ళా, కుక్క పిల్ల కాదేదీ కవితకి అనర్హం అన్నాడో మహా కవి. ఆ కవి మాటలను ఆదర్శంగా తీసుకున్నారో లేక తమ సరస సల్లాపాలకి ఇంకెక్కడా చోటు దొరకలేదో గానీ ఏకంగా విజయవాడ బస్టాండ్ లోనే దుకాణం పెట్టాయి ప్రేమ జంటలు. విషయంలోకి వెళ్తే లింకు టికెట్‌ ప్రయాణికుల సౌకర్యం కోసం పండిట్‌ నెహ్రూ బస్ స్టేషన్‌లో ‘లింక్‌ షెల్టర్‌’ను ఏర్పాటు చేశారు. బస్ స్టేషన్‌ డిపార్చర్‌ బ్లాక్‌లోనే ప్రత్యేకంగా రూం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రయాణికులు కూర్చోవటానికి, కాసేపు సేద తీరటానికి భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా బస్ స్టేషన్‌కు, బస్ స్టేషన్‌ నుంచి మరో ప్రాంతానికి కలిపి ఒకేసారి లింక్‌ టికెట్‌ తీసుకునే ప్రయాణికులకు ఈ ప్రత్యేక సౌకర్యం కల్పించారు.

తమ ప్రయాణాల మధ్యలో కార్లు, ఆటోలను ఆశ్రయించకుండా నేరుగా ఆర్టీసీ బస్సుల్లోనే వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆర్టీసీ అధికారులు భావించారు కానీ ప్రేమ పక్షులు మాత్రం ఈ సౌలభ్యాన్ని తమకి అనుకూలంగా మార్చుకున్నారు. అక్కడ జంటలు తప్ప సాధారణ ప్రయాణికులు ఎవరూ లేరని గుర్తించిన సిబ్బంది అక్కడ జంటలు చేస్తున్న సరస సల్లాపాలు చూసి విస్తుపోయారు. దీంతో అప్పటికప్పుడు ఆ లింకు షెల్టర్‌ను మూసి వేయించారు. సర్కారు ప్రజల సౌకర్యాల కోసం ఎన్నెన్ని సౌలభ్యాలు అందుబాటులోకి తెస్తున్నా ఇటువంటి వారి వల్ల అవి అర్హుల దాకా వెల్లవేమో ?