Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరంగల్ హంటర్ రోడ్డు సమీపంలోని రైల్వే ట్రాక్… బుధవారం ఉదయం 10.30గంటల సమయం… అటుగా వెళ్తున్న తెలంగాణ హోం గార్డ్ రవికి ఓ దృశ్యం కంటపడింది. రైల్వే ట్రాక్ పై ఓ అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు గట్టిగా పట్టుకుని నిలబడి ఉన్నారు. రైలు వచ్చే టైమయింది. విషయం హోం గార్డ్ కు అర్ధమయింది. వెంటనే తన మొబైల్ తో వారిని ఫొటో తీసి… మరుక్షణం ఆత్మహత్య చేసుకోవద్దంటూ పెద్దగా అరుస్తూ వారి వద్దకు పరుగులు తీశాడు. బలవంతంగా వారిని పట్టాల పై నుంచి పక్కకు లాగేశాడు. అనంతరం వారిని స్థానికుల వద్దకు తీసుకెళ్లాడు. ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకనుకున్నారని వారంతా ఆ యువజంటను ప్రశ్నించారు.
తాము కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని, ఇంట్లో వాళ్లు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నామని ఆ యువజంట చెప్పారు. స్థానికులతో కలిసి హోంగార్డ్ ఆ యువజంటకు కౌన్సెలింగ్ ఇచ్చాడు. ప్రాణాలు ఎంత విలువైనవో ఆ యువతీ యువకులకు అర్దమయ్యేలా చెప్పాడు. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లిచేసుకోవాలని సూచించి… వారిని ఇంటికి పంపాడు. రైల్వే ట్రాక్ పై యువజంట ఉన్నప్పుడు హోంగార్డ్ తీసిన వారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరిగ్గా సమయానికి స్పందించి రెండు విలువైన ప్రాణాలను కాపాడిన హోంగార్డ్ ను అందరూ ప్రశంసిస్తున్నారు.