Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ సూపర్ హిట్ మూవీ మెర్సెల్ లో వివాదాస్పదంగా మారిన జీఎస్టీ డైలాగ్ పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆరోగ్య సంరక్షణ, జీఎస్టీ, పన్ను వంటి అంశాల విషయంలో మెర్సెల్ సినిమాలో డైలాగులు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయని చెన్నైకు చెందిన ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమాలో ఓ చోట విజయ్ క్యారెక్టర్ 7శాతం జీఎస్టీ వసూల్ చేసే సింగపూర్ లో ఉచిత వైద్యసదుపాయాలు అందిస్తున్నారు. కానీ 28 శాతం జీఎస్టీ వసూలు చేసే మన ప్రభుత్వం ఉచిత వైద్యం ఎందుకు అందించలేకపోతోంది అని ప్రశ్నిస్తాడు. ఈ డైలాగ్ పై దేశవ్యాప్తంగా బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. డైలాగ్ ను తొలగించాలని పట్టుబట్టింది.
అయితే డైలాగ్ ను తొలగించాల్సిన అవసరం లేదని తమిళ అగ్రహీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ వంటివారు మెర్సెల్ కు మద్దతుగా నిలిచారు. కానీ వివాదాన్ని పొడిగించడం ఇష్టంలేని మెర్సెల్ నిర్మాత డైలాగ్ తొలగిస్తామని ప్రకటించారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఆ డైలాగ్ రాసాం తప్ప కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టే ఉద్దేశాలు తమకు లేవని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే ఓన్యాయవాది జీఎస్టీ డైలాగ్ ను తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదోపవాదాలు విన్న న్యాయస్థానం ఇది కేవలం సినిమా అని, నిజ జీవితం కాదని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉంటుందని వ్యాఖ్యానించి… పిటిషన్ ను కొట్టివేసింది.
అటు మెర్సెల్ తెలుగులో అదిరింది పేరుతో విడుదలవుతోంది. నిజానికి ఈ సినిమా ఇవాళ విడుదల కావాల్సి ఉన్నా… సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ లేక వాయిదా పడింది. బీజేపీ కోరుతున్నట్టుగా… వివాదాస్పద జీఎస్టీ డైలాగ్ ను అదిరింది నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.