Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీఆర్ ఎస్ కోరుతూ లక్ష్మీనారాయణ ఇటీవల మహారాష్ట్ర డీజీపీకి దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. డిప్యుటేషన్ పై గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ… పెను సంచలనాలు సృష్టించారు. అధికారులకు ప్రభుత్వాలు స్వేచ్ఛ ఇస్తే ఎన్ని అద్బుతాలు చేయవచ్చో నిరూపించారు. మైనింగ్ మాఫియా కింగ్ గాలిజనార్ధన్ రెడ్డితో పాటు అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ ను అరెస్టు చేసి నిజాయితీ గల అధికారిగా గుర్తింపుతెచ్చుకున్నారు. ఈ కేసుల్లో ఆయన వ్యవహరించిన తీరు… యువతకు ఆయన్ను రోల్ మోడల్ గా మార్చింది. తెలుగురాష్ట్రాల్లో ఆయనకు ఎందరో అభిమానులుగా మారిపోయారు.
అనంతరం లక్ష్మీనారాయణ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ఉద్యోగరీత్యా మహారాష్ట్రలో ఉన్నప్పటికీ తరచుగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి రానున్నారన్న ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే లక్ష్మీనారాయణ వీఆర్ ఎస్ ప్రకటించడంతో… రాజకీయాల్లోకి వచ్చేందుకే ఉద్యోగానికి స్వస్తి చెప్పారన్న వార్తలు వినిపించాయి. అయితే లక్ష్మీనారాయణ మాత్రం తన రాజకీయ ప్రవేశంపైగానీ, ఏ పార్టీలో చేరతారనేదానిపైనా ఎప్పుడూ పెదవి విప్పలేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న రాజకీయపరిస్థితుల్లో ఆయన బీజేపీలో చేరే అవకాశముందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.