Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కోల్ కతా నుంచి ఢిల్లీ వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకి వేగంగా పావులు కదుపుతున్నారు. మొదటగా ప్రాంతీయ పార్టీలకే ఈ ఫ్రంట్ పరిమితం అనుకున్నప్పటికీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సూచనతో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ని కూడా ఈ ఫ్రంట్ లో ప్రత్యక్ష లేదా పరోక్ష భాగస్వామిని చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే ఆమె కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో సమావేశం కావడం. ఈ వ్యవహారం అంతా బీజేపీ కి మరీ ముఖ్యంగా మోడీ అభిమానులకి పుండు మీద కారం చల్లినట్టుంది. అందులో పెద్ద వింత ఏమీ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం అయిన వైసీపీ, జనసేనకు కూడా మమతా బెనర్జీ చర్యలు ఏ మాత్రం నచ్చడం లేదు. దానికి కారణం లేకపోలేదు.
మోడీ వ్యతిరేకులు అందర్నీ ఏకతాటి మీదకు తెస్తున్న మమతా బెనర్జీ చివరకు బీజేపీ లో అసంతృప్తుల్ని కూడా కలిశారు. ఇక రాష్ట్రాల వారీగా వున్న రాజకీయ పరిస్థితుల్ని కూడా అంచనా వేసుకుని మరీ ఆయా పార్టీలకు ఇబ్బంది లేకుండా ఫ్రంట్ రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకుంటున్న మమతా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఫుల్ క్లారిటీ తో వున్నారు. ఎప్పుడైతే సీఎం చంద్రబాబు nda నుంచి బయటకు వచ్చి అవిశ్వాసంతో ప్రధాని మోడీని ఢీకొట్టారో అప్పటి నుంచి అడక్కుండానే ఆమె చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. పదేపదే బాబుకు అనుకూలంగా ట్వీట్స్ చేశారు. ఇక మేము చంద్రబాబు కన్నా ఎక్కువగా ప్రధాని మోడీ మీద ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడుతున్నాం అని చెప్పుకుంటున్న వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మమతా బెనర్జీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. వారి పేరు కూడా ఎత్తలేదు. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేస్తాం అంటున్నారు కదా అని పాత పరిచయాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ఎంపీ ఒకరు, మమతా అనుచరుడు ఒకరిని కదిలించారట. మీ పేరు చెప్తే మమతా మండిపడుతున్నారు, ఇంకెప్పుడు ఈ విషయం కోసం ఫోన్ చేయొద్దని అతను సూటిగా వైసీపీ ఎంపీ కి చెప్పేశారట. ఇక జనసేన కి జాతీయ స్థాయిలో మమతా ని కలవాలన్న ఆలోచన కూడా లేనట్టుంది. మొత్తానికి మమతా బెనర్జీ నోరు ఎత్తకుండా తన చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో మోడీ వ్యతిరేకులు ఎవరో, అనుకూలురు ఎవరో చెప్పకనే చెప్పారు.