Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్వీట్లన్నింటిలోకి ప్రత్యేకమైనది రసగుల్లా. నోట్లోవేసుకోగానే కరిగిపోయి… నోరు మొత్తం తీపి చేస్తుంది. రసగుల్లా పేరు వింటేనే నోరూరిపోతుంది. తియ్యతియ్యటి రసగుల్లాలును చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ ఇష్టపడతారు. అలాంటి తీపి రసగుల్లా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. రసగుల్లా మాదే అంటే మాదే అని ఆ రెండు రాష్ట్రాలూ కోట్లాడుకున్నాయి. చివరికి తీపియుద్ధంలో పశ్చిమబంగ గెలిస్తే… ఒడిశా ఓడిపోయింది. నోరూరించే రసగుల్లా… పశ్చిమబంగదేనని తేలిపోయింది.
రసగుల్లా స్వీట్ గురించి రెండున్నరేళ్లగా పశ్చిమం బంగ, ఒడిశా రాష్ట్రాల మద్య వివాదం సాగుతోంది. ఒడిశాలోని పూరీలో పుట్టిన ఖీర్ మొహానా కాలక్రమంలో రసగుల్లాగా మారిందని ఒడిశా వాదించింది. అయితే రసగుల్లా పశ్చిమ బంగకు చెందిన వంటకమని, బెంగాలీలే మొదటిగా దీన్ని తయారుచేశారని, 1868లోనే బెంగాలీ స్వీట్ తయారీదారుడు నబీన్ చంద్రదాస్ రసగుల్లాను తయారుచేశాడని ఆ రాష్ట్రం వాదించింది. ఈ వాదన ఎందుకు మొదలయిందంటే… నాణ్యత, పేరుప్రఖ్యాతులు ఉన్న ఆయా వస్తువులను వాటి మూలాలను బట్టి ఆయా ప్రాంతాలకు చెందినవని నిర్ధారిస్తూ జీఐ చిహ్నాలను మంజూరుచేస్తుంటారు. జీఐ పొందే క్రమంలో ఆ వస్తువు మూలాలు కచ్చితంగా ఆ ప్రాంతంలోనే ఉన్నాయని నిరూపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పశ్చిమబంగ, ఒడిశా రసగుల్లా మాదంటే మాదని 2015 నుంచి వాదనకు దిగాయి.
ఈ పోటీ సోషల్ మీడియాకు ఎక్కడంతో మరింత చర్చనీయాంశమయింది. చివరకు చెన్నైలోని భౌగోళిక గుర్తింపు కేంద్రం బెంగాల్ చూపిన రుజువులను ఒప్పుకుని తీపి రారాజు రసగుల్లాకు ఆ రాష్ట్రంపేరు మీదే గుర్తింపు నమోదుచేసింది. రసగుల్లా పశ్చిమ బంగకు చెందినదే అని నిర్ధారణ కావడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంతోషం వ్యక్తంచేశారు. లండన్ లో ఉన్న ఆమె దీనిపై ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ స్వీట్ న్యూస్ అని, అందరం ఎంతో గర్వపడాల్సిన రోజని, రసగుల్లా మనదే అని రాష్ట్రానికి భౌగోళిక గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. మొత్తానికి 1868లో బెంగాల్ లో తయారయిన రసగుల్లా… ప్రపంచవ్యాప్తంగా. స్వీటెస్ట్ స్వీట్ గా గుర్తింపు పొందింది.