రాను రాను మనుషులలో మానవత్వం నశిస్తోందని చెప్పడానికి నిదర్శనం ఈ ఘటన. ఒక కాకి మీద దాడి చేస్తే వందలాది కాకులు మన మీద దాడి చేస్తాయే అలాంటిది రోడ్డు మీద ఒక యువతిని అత్యంత పాశవికంగా తమ కళ్ల ఎదురుగా పశువుని నరికినట్లు నరుకుతున్నా ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా దగ్గరకి రాలేదు. గత నెల 20న జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని దిండిగల్ జిల్లా రాజపాలెంకి చెందిన మదీశ్వరన్ అనే వ్యక్తి తనను ప్రేమించట్లేదని ప్రియ అనే యువతిని నడిరోడ్డులో తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో అత్యంత కిరాతంగా నరికాడు. ఆ మహిళ ఆర్థనాధాలు చేస్తున్నా అక్కడున్న స్థానికులందరూ ఈ దారుణాన్ని చూస్తూ ఉండిపోయారు.
ఒక వ్యక్తి ముందుకు వచ్చినా అతన్ని కూడా కత్తితో బెదిరించడం వల్ల దాడి చేసిన వ్యక్తి పారిపోయేదాకా స్థానికులు ఏమీ చేయలేక పోయారు. అంతా అయిపోయాక పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మదీశ్వరన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరిణించింది. రాజపాలెం బస్టాండ్లో జరిగిన ఈ దారుణం సీసీ ఫుటేజీలో రికార్డవడం ద్వారా వెలుగులోకి వచ్చింది.