అమ్మాయిల తీరు భ‌యం క‌లిగిస్తోంది…

Manohar Parrikar says Women are consuming alcohol in Goa
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఒక‌ప్పుడు మ‌ద్యం అంటే అబ్బాయిలు మాత్ర‌మే తాగుతార‌ని భావించేవారు. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు.  పోలీసులు నిర్వ‌హిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ లో అబ్బాయిల‌తో పాటు అమ్మాయిలు కూడా ప‌ట్టుబ‌డుతున్నారు. ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలకు చెందిన అమ్మాయిలు మ‌ద్యం సేవించ‌డం సాధార‌ణ విష‌యంగా మారింది. దేశంలోని అన్ని న‌గ‌రాల్లో ఈ ప‌రిస్థితి ఉన్న‌ప్ప‌టికీ… ప‌ర్యాట‌క ప్రాంతం గోవాలో మందుపుచ్చుకునే అమ్మాయిల సంఖ్య చాలా ఎక్కువ‌గా ఉంటోంది. సాక్షాత్తూ గోవా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్  ఈ విష‌యాన్ని వెల్ల‌డించి ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. అమ్మాయిల్లో ఆల్క‌హాల్ సేవించే అల‌వాటు ఎక్కువ‌వుతోంద‌ని… ఇది త‌న‌కెంతో భ‌యాన్ని క‌లిగిస్తోంద‌ని మ‌నోహ‌ర్ పారిక‌ర్ అన్నారు. అమ్మాయిలు కూడా బీర్లు తాగ‌డం ప్రారంభించారు. అది కూడా పరిమితికి మించిపోతోంది. వీళ్ల‌ను చూస్తే భ‌య‌మేస్తోంది అని స్టేట్ యూత్ పార్ల‌మెంట్ లో చేసిన ప్ర‌సంగంలో పారిక‌ర్ ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.
తాను అమ్మాయిలంద‌రి గురించి మాట్లాడ‌డంలేద‌ని, ఇక్క‌డ కూర్చున్న వారి గురించి అన‌డం లేద‌ని, అంద‌రూ అలా ఉన్నార‌న్న‌ది త‌న అభిప్రాయం కాద‌ని, అయితే మ‌ద్యం సేవించే అమ్మాయిల సంఖ్య మాత్రం పెరుగుతోంద‌ని, ఇది భ‌యం క‌లిగిస్తోంద‌ని పారిక‌ర్ వ్యాఖ్యానించారు. గోవాలో మాద‌క‌ద్ర‌వ్యాల వ్యాపారంపైనా ఆయ‌న స్పందించారు. డ్ర‌గ్ నెట్ వ‌ర్క్ ను అంత‌మొందించే ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంద‌ని, రాష్ట్రం నుంచి డ్ర‌గ్స్ ను త‌రిమికొడ‌తాన‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. డ్ర‌గ్స్ వినియోగం కాలేజీల్లో విప‌రీతంగా ఉంద‌ని తాను న‌మ్మ‌డం  లేద‌ని, అయితే పూర్తిగా లేద‌ని మాత్రం అన‌డం లేద‌న్నారు. డ్ర‌గ్స్ మాఫియాపై చ‌ర్య‌లు ప్రారంభించిన త‌ర్వాత ఇటీవ‌ల 170 మందిని అరెస్ట్ చేశామ‌ని తెలిపారు. రాష్ట్రంలో పూర్తిగా డ్ర‌గ్స్ లేకుండా చేసే వ‌ర‌కు మాఫియాపై దాడులు కొన‌సాగుతాయ‌ని పారిక‌ర్ వెల్ల‌డించారు. నిరుద్యోగంపైనా, యువ‌త మ‌న‌స్త‌త్త్వంపైనా పారిక‌ర్ వ్యాఖ్య‌లు చేశారు. యువ‌త క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డానికి ముందుకు రావ‌డం లేద‌ని, సులువుగా ఉండే ఉద్యోగాలు కావాలని చూస్తున్నార‌ని, అందుకే క్ల‌ర్క్ ఉద్యోగాల కోసం క్యూక‌డుతున్నార‌ని, గ‌వ‌ర్న్ మెంట్ జాబ్ అంటే ప‌ని ఉండ‌ద‌నే భావంతో ఉన్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తంచేశారు.