గత కొంత కాలంగా భారత్, చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే అక్కడ తూర్పు లడఖ్‌లో సైనిక ఉద్రిక్తతలను ముగింపు పలికేందుకు భారత్, చైనా తాజాగా మరోసారి చర్చలు జరిపాయి. మేజర్ జనరల్ స్థాయి అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. సానుకూల వాతావరణంలో ఫలప్రదంగా చర్చలు సాగినట్లు సీనియర్ సైనికాధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్‌నాటి యథాతథ స్థితిని పునరుద్ధరించడంతోపాటు, సరిహద్దుల నుంచి తక్షణమే చైనా తన బలగాలను ఉపసంహరించుకోవాలని భారత్ బృందం డిమాండ్ వెల్లడించింది.
అదేవిధంగా ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో రెండు దేశాలు పరిమిత సంఖ్యలో బలగాల ఉపసంహరణను ప్రారంభించిన మరుసటి రోజే ఈ చర్చలు జరిగాయి. కాగా పాంగాంగ్, దౌలత్‌బేగ్ ఓల్డీ, దెమ్‌చోక్‌లో మాత్రం బలగాలు కొనసాగుతున్నాయి. అలాగే.. సరిహద్దు సమస్యపై ఈనెల 6న ఇరు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు కూడా జరిపారు. ఆ చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయంతో తిరిగి సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలూ చర్యలు ప్రారంభించాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ వివరించారు.