Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా కుటుంబంలో ఒకప్పుడు విభేదాలు ఉన్నాయేయో కానీ ఇప్పుడందరూ కలిసికట్టుగా ఉంటున్నారు. ఆనందాలను కలిసి పంచుకుంటున్నారు. అలాగే కష్టమేమైనా ఎదురైతే కలిసే ఎదుర్కొంటున్నారు. రామ్ చరణ్ బర్త్ డే వేడుకకు, రంగస్థలం సక్సెస్ మీట్ కు పవన్ హాజరై అన్యయ్య కుటుంబంలోని సంతోషాన్ని పంచుకున్నారు. అలాగే ఇప్పుడు పవన్ కు కష్టమొస్తే మెగా కుటుంబమంతా స్పందిస్తోంది. పవన్ కళ్యాణ్ పై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో మెగా హీరోలంతా ఒక్కొక్కరుగా పవన్ కు బాసటగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ స్పందించాడు. కపటి మాటలు చెప్పేవారిని, విమర్శలు చేసేవారిని పట్టించుకోకూడదని, వారి బలహీనతల్ని తెలుసుకునే తెలివి వారికి లేదని, అలాంటి వారు అద్దంలో వారి అసలు స్వరూపం చూసుకోవడం కంటే ఇతరులపై విమర్శలు చేయడం సులువుగా భావిస్తారు అని ట్వీట్ చేశాడు. నాగబాబు ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చాడు. ఏదైనా తప్పు చేసి ఉంటే ప్రజల ముందు బహిరంగంగా చెప్పే దమ్మున్న మగాడు తన సోదరుడని, వాడిని తిట్టి, వాడిని విమర్శించడం సరైనదని కాదని నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పవన్ నిశ్శబ్దాన్ని చేతగానితనంగా అనుకోవద్దని హెచ్చరించారు.
తాజాగా రామ్ చరణ్ ఈ వివాదంపై స్పందించాడు. అందరూ కలిసి పనిచేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ అని రామ్ చరణ్ అభిప్రాయపడ్డాడు. ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారని, ఏవైనా సమస్యలు ఉంటే వాటిని న్యాయబద్ధంగా, సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలని సూచించాడు. కొందరు కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడడం చవకబారుతనంగా ఉంటుందని రామ్ చరణ్ మండిపడ్డాడు. శ్రీరెడ్డి కామెంట్ పై పవన్ స్పందించిన వీడియోను కూడా చరణ్ పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో పవన్ నాపై కామెంట్లు చేస్తుంటారని, వాటన్నింటినీ భరిస్తానని, నన్నేమన్నా అంటే మీకు కోపం వస్తుందని, కానీ అది తప్పని, భరిద్దామని, భరించేవాడే గెలుస్తాడని అభిమానులకు హితవుపలికాడు.